18 ఏళ్ల బంధానికి బ్రేక్: CSK హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై

18 ఏళ్ల బంధానికి బ్రేక్: CSK హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై

చెన్నై: ఐపీఎల్‎లో మోస్ట్ పాపులర్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ప్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. సీఎస్కే యాజమాన్యం సోమవారం (జులై 13) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. పరస్పర అంగీకారంతో సీఎస్కే హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. దీంతో సీఎస్కే, ఫ్లెమింగ్ మధ్య 18 ఏళ్ల సుధీర్ఘ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. 

2008లో ఆటగాడిగా చెన్నైలో చేరిన ఫ్లెమింగ్.. 2009 నుంచి ఆ జట్టు హెడ్ కోచ్‎గా వ్యవహరిస్తున్నాడు. ఫ్లెమింగ్ సారథ్యంలో చెన్నై జట్టుకు ఐపీఎల్‎లో తిరుగే లేకుండా పోయింది. ఫ్లెమింగ్, ధోనీ కాంబినేషన్‎లో సీఎస్కే 5 ఐపీఎల్ టైటిల్స్, 2 చాంపియన్స్ ట్రోఫీలు గెలిచింది. రికార్డు స్థాయిలో 12 సార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించగా.. 10 ఫైనల్స్‌లో భాగమైంది.

అయితే, గత మూడేళ్లుగా ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ప్లాఫ్ షో కనబర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్లెమింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

సీఎస్‌కే ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటది: ఫ్లెమింగ్

18 ఏళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలుకుతూ సీఎస్కేను వీడటంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. సీఎస్‌కే ఎల్లప్పుడూ నా గుండెల్లోనే ఉంటదని పేర్కొన్నాడు. ‘‘క్రీడా ప్రపంచంలో పద్దెనిమిదేళ్లు అంటే ఒక జీవితకాలం లాంటిది. కృతజ్ఞత తప్ప ఎలాంటి బాధ లేకుండా జట్టును వీడుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌తో గడిపిన సమయం నా కోచింగ్ కెరీర్‌లో లభించిన ఒక గొప్ప అవకాశం. 

►ALSO READ | రూ.91 వేల కోట్ల స్పోర్ట్స్ డీల్.. సియాటిల్ సీహాక్స్‌ను సొంతం చేసుకున్న భారతీయుడు!

మేము సాధించిన ప్రతిదానికీ నేను గర్వపడుతున్నాను. మనందరం కలిసి ఎన్నో మరపురాని విజయాలను జరుపుకున్నాం. కష్ట సమయాలను కూడా చవిచూశాం. నా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను నిర్మించుకున్నాం. సీఎస్‌కే ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. భవిష్యత్‎లో కూడా నేను ఆ జట్టుకు మద్దతు ఇస్తూనే ఉంటాను’’ అని ఫ్లెమింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.