ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయింది. పెళ్లి బంధువులందరు అంతా కలిసి ఒక ఏసీ రైలు భోగీని పెళ్లి మండపంల ముస్తాబు చేసి హంగామా చేశారు. అయితే సాధారణ ప్యాసింజర్లు ప్రయాణించే రిజర్వేషన్ కోచ్‌లలో ఇలాంటి పనులు చేయడానికి రైల్వే శాఖ ఒప్పుకోదు. అందుకే దీనిపై విచారణ కూడా మొదలైంది.
కానీ, మీ ఇంట్లో పెళ్లికో, ఫంక్షన్‌కో చుట్టాలందరినీ ఒకే చోట తీసుకెళ్లడానికి మొత్తం రైలును గానీ, లేదా ఒక ప్రత్యేక భోగీ (కోచ్)ని గానీ అద్దెకు తీసుకోవచ్చని మీకు తెలుసా ? భారతీయ రైల్వే ఇందుకోసం 'ఫుల్ టారిఫ్ రేట్' (FTR) అనే ప్రత్యేక సర్వీస్ అందిస్తోంది. ఇదెలా పనిచేస్తుంది, దీని నియమాలు, ఖర్చులు ఏంటో తెలుసుకుందామా...!
ఎప్పుడు బుక్ చేసుకోవాలి ?
*ముందుగా మీరు ప్రయాణం చేయాలనుకునే తేదీకి కనీసం 30 రోజుల ముందు నుండి 6 నెలల లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎన్ని భోగీలు ఇస్తారు?:
విడిగా బుక్ చేసుకుంటే ఒక వ్యక్తి ఒకేసారి 2 కోచ్‌ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం రైలునే బుక్ చేసుకోవాలనుకుంటే.. కనీసం 18 కోచ్‌ల నుండి గరిష్టంగా 24 కోచ్‌ల వరకు ఇస్తారు.
ఒక చిన్న కండిషన్:
మీ ప్రయాణించే కోచ్‌ను రైలుకు తగిలించాలన్నా లేదా తీసేయాలన్నా.. ఆ రైలు ఆ స్టేషన్‌లో కనీసం 10 నిమిషాల పాటు ఆగాల్సి ఉంటుంది. అందుకే అన్ని రైళ్లకూ ఈ సేవలు వర్తించవు.
సెక్యూరిటీ డిపాజిట్ ఎంత కట్టాలి?
ఆన్‌లైన్ లో మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్) కట్టాల్సి ఉంటుంది. ఒక్కో కోచ్‌కి రూ.50వేల చొప్పున అడ్వాన్స్ కట్టాలి. మొత్తం రైలుకైతే అంటే ఒకవేళ మీరు 18 కంటే తక్కువ భోగీలు ఉన్న రైలును బుక్ చేసుకున్నా సరే, కనీసం రూ.9 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు కట్టగానే మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దీనిని జాగ్రత్తగా దాచుకోవాలి.
డబ్బులు కట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన రూల్స్ :
అప్లికేషన్ పెట్టుకున్న 6 రోజుల్లోపు పూర్తి డబ్బులు కట్టేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. విడతల వారీగా (NEFT/RTGS ద్వారా పార్ట్ పేమెంట్లు) కడితే బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి.
►ALSO READ | ఆయుర్వేదం: ఈ రోగాలకు వంటింట్లోని సరుకులతోనే ముందు తయారు చేసుకోవచ్చు.. ఆస్పత్రికి వెళ్లకుండానే నయం..!
ప్రయాణం అయిపోయాక డిపాజిట్ డబ్బులు వెనక్కి వస్తాయా?
అవును, వస్తాయి ! మీ ప్రయాణం ముగిసిన తర్వాత, రైల్వే శాఖ ఇచ్చే 'నో డ్యూస్ సర్టిఫికేట్', ఒరిజినల్ టూర్ ఫోల్డర్‌ను 21 రోజుల్లోపు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆఫీసులో సమర్పిస్తే మీ సెక్యూరిటీ డిపాజిట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు. 21 రోజులు దాటితే మాత్రం తీసుకోరు.
ఒకవేళ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత కట్ అవుతుంది ?
మీరు అనుకోకుండా ప్రయాణాన్ని క్యాన్సల్ చేసుకుంటే, మీరు కట్టిన అడ్వాన్స్ అమౌంట్‌లో కొంత కట్ చేస్తారు. ప్రయాణానికి రెండు రోజులు లేదా అంతకంటే ముందే రద్దు చేసుకుంటే 10%... ప్రయాణానికి ఒక రోజు నుండి 4 గంటల ముందు రద్దు చేసుకుంటే 25%.. ప్రయాణానికి 4 గంటల లోపు లేదా రైలు స్టార్ట్ అయిపోయాక క్యాన్సల్ చేసుకుంటే 50% డబ్బులు కట్ అవుతాయి.
అయితే, ఏదైనా కారణం వల్ల రైల్వే శాఖ లేదా ఐఆర్‌సీటీసీనే మీ బుకింగ్‌ను రద్దు చేస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా మీ పూర్తి డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు.
