పడిపోయిన ల్యాబ్ డైమండ్ రేట్లు.. అప్పట్లో లక్ష.. ఇప్పుడు రూ.12వేలకే!

పడిపోయిన ల్యాబ్ డైమండ్ రేట్లు.. అప్పట్లో లక్ష.. ఇప్పుడు రూ.12వేలకే!

డైమండ్ జ్యువెలరీ కేవలం సంపన్న వర్గాలే కొంటాయ్ అని అనుకుంటాం. కానీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక డైమండ్ రింగ్, పెండెంట్ లేదా హారం కొనుక్కోవాలని ఉంటుంది.. కానీ లక్షలు వెచ్చించి కొనే స్తోమత చాలా మందికి ఉండదు. అలాంటి వారికోసం పుట్టుకొచ్చినవే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. 5 ఏళ్ల కిందట మార్కెట్లో ఆకాశాన ఉన్న వీటి ధరలు ప్రస్తుతం నేలకు దిగొచ్చాయి. జస్ట్ రూ.20వేల బడ్జెట్లో డైమండ్ రింక్ కూడా దొరకుతోందంటే వీటివల్లనే అది సాధ్యం అయ్యింది. 

వజ్రం అంటే ఒకప్పుడు విలాసానికి, సంపదకు ప్రతీక. పెద్ద క్యారెట్ డైమండ్ కొనాలంటే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే కలను తక్కువ ధరలో నిజం చేస్తున్నాయి ల్యాబ్-గ్రోన్ డైమండ్స్. గత 6 సంవత్సరాల్లో వీటి ధరలు ఏకంగా 88 శాతం వరకు పడిపోవడంతో భారత ఆభరణాల మార్కెట్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు సహజ వజ్రాలకే పరిమితమైన వినియోగదారులు ఇప్పుడు ల్యాబ్‌లో తయారైన వజ్రాలవైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు జ్యువెలరీ బ్రాండ్ల వ్యూహాలనే కాదు.. దేశంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్ వ్యాపార ప్రణాళికలను కూడా మార్చేస్తోంది.

2020 నుంచి 2026 మధ్య ల్యాబ్-గ్రోన్ డైమండ్ల ధరలు ఒక్క క్యారెట్‌కు సుమారు 88 శాతం వరకు తగ్గాయని జ్యువెలరీ ఇండస్ట్రీ చెబుతోంది. దీంతో గతంలో అందని ధరలో ఉన్న 2 నుంచి 3 క్యారెట్ల సోలిటైర్ డైమండ్లు ఇప్పుడు చాలా మందికి అందుబాటులో రేట్లకే వచ్చేశాయి. ముఖ్యంగా యువత, తొలిసారి వజ్రాభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయులకు పెద్ద సోలిటైర్ డైమండ్లపై ప్రత్యేక ఆకర్షణ ఉండటంతో, ల్యాబ్-గ్రోన్ డైమండ్లు ఆ కలను తక్కువ ఖర్చుతో నెరవేర్చుతున్నాయని డీఎల్‌ఎఫ్ రిటైల్ ప్రతినిధి వెల్లడించారు.

►ALSO READ | AIపై తిరగబడ్డ జనం.. అమెరికాలో టెక్ కంపెనీల ఆఫీసుల ముందు భారీ నిరసనలు

ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ల్యాబ్-గ్రోన్ డైమండ్లకు ప్రత్యేకంగా పనిచేసే బ్రాండ్లు దేశవ్యాప్తంగా మాల్స్, హైస్ట్రీట్లలో వేగంగా కొత్త స్టోర్లను ప్రారంభిస్తున్నాయి. రిటైల్ డెవలపర్లు కూడా ఈ విభాగానికి తమ మాల్స్‌లో ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తున్నారు. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థ CBRE అంచనా ప్రకారం.. 2032 నాటికి ప్రపంచ ల్యాబ్-గ్రోన్ డైమండ్ మార్కెట్ విలువ 60 నుంచి 100 బిలియన్ డాలర్ల మధ్యకు చేరే అవకాశం ఉంది. తక్కువ ధరలో లగ్జరీ అనుభూతిని అందించే ఉత్పత్తిగా ఈ వజ్రాలు మార్కెట్‌ను విస్తరిస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.

అయితే నేచురల్ డైమండ్స్‌కి ప్రజల్లో ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని జ్యువెలరీ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకలు, భారీ పెట్టుబడి విలువ కలిగిన ఆభరణాల విషయంలో సహజ వజ్రాలకే ఇప్పటికీ ఎక్కువ ఆదరణ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా 5 క్యారెట్లకు పైబడిన సహజ వజ్రాలకు డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. మరోవైపు టైటాన్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్లను ప్రారంభించడం ఈ కేటగిరీ భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో సహజ వజ్రాలు, ల్యాబ్-గ్రోన్ డైమండ్లు రెండూ తమ తమ విభాగాల్లో కలిసి మార్కెట్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం తక్కువ ధరలో పెద్ద వజ్రాలను సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు ల్యాబ్-గ్రోన్ డైమండ్లు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.