ఇంటర్నెట్ అవసరం లేనివారికి ట్రాయ్ బంపర్ ఆఫర్.. కొత్త రీఛార్జ్ రూల్స్ ఇవే

ఇంటర్నెట్ అవసరం లేనివారికి ట్రాయ్ బంపర్ ఆఫర్.. కొత్త రీఛార్జ్ రూల్స్ ఇవే

మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక ప్రతిపాదనతో టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ (TRAI) ముందుకొచ్చింది. డేటా అవసరం లేని మెుబైల్ యూజర్లకు ఎందుకు దాని కోసం డబ్బు చెల్లించాలి?" అనే ప్రశ్నను ప్రధానంగా తీసుకుని టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026 ముసాయిదాను విడుదల చేసింది. ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు డేటాను కలిపిన రీఛార్జ్ ప్లాన్‌లనే ఎక్కువగా అందిస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ అవసరం లేకపోయినా, వినియోగదారులు ఖరీదైన డేటా ప్లాన్‌లను కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ట్రాయ్ తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది.

కొత్త ప్రతిపాదన ప్రకారం.. టెలికాం కంపెనీలు 7, 28, 56, 84 రోజుల వ్యాలిడిటీతో డేటా ప్లాన్‌లు అందిస్తే.. అదే కాలపరిమితితో జస్ట్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్‌లను కూడా తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. అంటే డేటా అవసరం లేని వినియోగదారులు ఇకపై అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఫైనల్ ధరలను టెలికాం కంపెనీలే నిర్ణయించినప్పటికీ.. డేటా లేకుండా ఉండే ప్లాన్‌లు ప్రస్తుతం ఉన్న బండిల్ ప్లాన్‌లతో పోలిస్తే 50 నుంచి 70 శాతం వరకు చౌకగా ఉండే అవకాశం ఉందని ట్రాయ్ అంచనా వేస్తోంది. ఉదాహరణకు ప్రస్తుతం రూ.300 ఉన్న ప్లాన్, డేటా లేకుండా రూ.100 నుంచి రూ.150 మధ్య అందుబాటులోకి రావొచ్చు. 

►ALSO READ | AI కోసం 9వేల మంది స్పెషల్ ఇంజనీర్లను దింపిన TCS.. వీళ్లు ఏం చేస్తారో తెలుసా?

ఈ నిర్ణయం ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లు, కాల్స్ కోసం మాత్రమే రెండో సిమ్ ఉపయోగించే వారు, ఇంటర్నెట్ కంటే వాయిస్, ఎస్ఎంఎస్ సేవలకే ప్రాధాన్యం ఇచ్చే లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం ఇలాంటి వినియోగదారులకు పరిమిత వ్యాలిడిటీతో మాత్రమే కాలింగ్ ప్లాన్‌లు అందుబాటులో ఉండటంతో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాయ్ ప్రతిపాదన అమల్లోకి వస్తే వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ ఎంచుకునే స్వేచ్ఛ పెరగడంతో పాటు.. టెలికాం కంపెనీల మధ్య పోటీ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ముసాయిదాపై అభిప్రాయాల సేకరణ ట్రాయ్ కొనసాగిస్తోంది. దీంతో భవిష్యత్తులో డేటా అవసరం లేని వారికి తక్కువ ధరలో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం దొరకనుంది.