E20 పెట్రోలుతో 60% మైలేజ్ డ్రాప్ అయిందని బెంజ్ కారు ఓనర్ వీడియో.. కంపెనీ రియాక్షన్ ఏంటంటే?

E20 పెట్రోలుతో 60% మైలేజ్ డ్రాప్ అయిందని బెంజ్ కారు ఓనర్ వీడియో.. కంపెనీ రియాక్షన్ ఏంటంటే?

భారత్‌లో E20 పెట్రోల్‌పై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ప్రముఖ యూట్యూబర్.. దేశంలో అత్యధిక మంది ఫాలో అయ్యే డైలీ వ్లాగర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ మైలేజ్ ఒక్కసారిగా పడిపోయిందని చెబుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆయన E20 పెట్రోల్ వల్లే తన కారు పనితీరు దెబ్బతిందని ఆరోపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయటంతో మెర్సిడెస్-బెంజ్ ఇండియా అధికారికంగా పెట్రోల్ వాహనాలపై క్లారిటీ ఇచ్చింది.

ఓనర్ సౌరవ్ జోషి ఏమన్నారు?
తన వీడియోలో సౌరవ్ జోషి బెంజ్ కారు మైలేజ్ 17 కిలోమీటర్ల నుంచి మొదట 9 కిలోమీటర్లకు.. ఆ తర్వాత కేవలం 48 గంటల్లోనే 5 కిలోమీటర్లకు పడిపోయిందని వెల్లడించారు. గతంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే కారు.. ఇప్పుడు E20 పెట్రోలు ఫుల్ ట్యాంక్‌తో కేవలం 480 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే చూపిస్తోందని చెప్పారు. దీంతో మైలేజ్ ఏకంగా 60 శాతం వరకూ పడిపోవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణం పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ అని ఆయన ఆరోపించారు. దీంతో తన జర్మన్ లగ్జరీ ఎస్‌యూవీ ఇంజిన్ దెబ్బతింటుందేమోనని భయపడుతున్నానని, ఇప్పుడు పెట్రోల్ పోయించుకోవాలంటే కూడా భయంగా ఉందని వీడియోలో చెప్పాడు.

మెర్సిడెస్-బెంజ్ కౌంటర్.. E20పై అధికారిక ప్రకటన
వీడియో వైరల్ అయిన కొద్ది సేపటికే మెర్సిడెస్-బెంజ్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ నేరుగా సౌరవ్ జోషి పేరును ప్రస్తావించకపోయినా.. E20 పెట్రోల్‌పై వస్తున్న సందేహాలకు సమాధానం ఇచ్చింది. తమ BS-VI పెట్రోల్ వాహనాలన్నీ E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా రూపొందించబడ్డాయని, సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన సర్టిఫికేషన్లు కూడా పొందాయని స్పష్టం చేసింది. వినియోగదారులకు ఎలాంటి సాంకేతిక సందేహాలు ఉన్నా తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను సంప్రదించాలని సూచించింది. సేఫ్టీ, పనితీరు, విశ్వసనీయత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ట్వీట్ చేసింది. 

అసలు E20 అంటే ఏమిటి? ఎందుకు వివాదం?
E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమం. క్రూడ్ దిగుమతులు తగ్గించటం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో మోడీ ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది. అయితే E20 వాడితే మైలేజ్ కొంత తగ్గుతుందని, ముఖ్యంగా పాత మోడల్ కార్ల ఇంజిన్‌లపై ప్రభావం ఉండొచ్చనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. 

కొత్త కార్లకు సమస్య లేదంటున్న బెంజ్..
మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రకారం 2020 తర్వాత విక్రయించిన అన్ని BS-VI పెట్రోల్ మోడళ్లు E20 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడ్డాయట. ముఖ్యంగా 2023-24 మోడళ్లు తాజా ఉద్గార, ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో E20కు అనుకూలంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. పాత వాహనాల్లో స్వల్ప స్థాయిలో మైలేజ్ తగ్గుదల కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, కొత్త BS-VI వాహనాల్లో E20 వల్ల ఇంజిన్‌కు హాని కలుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో వైరల్ వీడియోతో మొదలైన చర్చకు కంపెనీ తనవైపు నుంచి పూర్తి వివరణ ఇచ్చినట్లైంది.