సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చిల్లర లేదా ? అయితే దిగు దిగు.. అని కండక్టర్లు అనడం మనం చూస్తూనే ఉంటాం. సామాన్య జనాలకి రోజూ ఎదురయ్యే ఈ చేదు అనుభవం.. ఈసారి ఏకంగా కర్ణాటక కొత్త రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌కే ఎదురైంది. ముఖానికి మాస్క్ వేసుకుని మారువేషంలో బస్సెక్కిన మంత్రిని.. చిల్లర ఇవ్వలేదనే కోపంతో కండక్టర్ నడిరోడ్డుపై బస్సులోంచి దింపేశాడు.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరు నగరంలో బస్సులు, ఆటోల్లో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా తెలుసుకోవాలని మంత్రి బైరతి సురేష్ అనుకున్నారు. అందుకోసం శనివారం రాత్రి ఆయన తన కారును పక్కన పెట్టి, ముఖానికి మాస్క్ తగిలించుకుని సాదాసీదా ప్రయాణికుడిలా హెబ్బాల్ దగ్గర బెంగళూరు సిటీ బస్సు ఎక్కారు.
రూ. 100 నోటు ఇస్తే సీరియస్
మంత్రి రెండు టిక్కెట్లు తీసుకుని కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. దింతో ఆ కండక్టర్ తన దగ్గరున్న క్యాష్ బ్యాగ్ తెరిచి చూపిస్తూ.. "నా దగ్గర చిల్లర లేదు, సరిగ్గా రూ. 12 చిల్లర ఇవ్వు" అని డిమాండ్ చేశాడు. మంత్రి దగ్గర కూడా చిల్లర లేకపోవడంతో.. "చిల్లర లేకపోతే కుదరదు.. వచ్చే స్టాప్‌లో బస్సు దిగిపో" అని మాస్క్ వేసుకున్న మంత్రికి కండక్టర్ ఆర్డర్ వేశాడు.
సైలెంట్‌గా దిగిపోయిన మంత్రి: అక్కడ గొడవ పడి తన గుర్తింపును బయటపెట్టడం ఇష్టం లేక, మంత్రి కండక్టర్ చెప్పినట్లే సైలెంట్‌గా బస్సు దిగిపోయారు. ఆ తర్వాత విషయం తెలిసి BMTC అధికారులు సదరు కండక్టర్‌పై విచారణ మొదలుపెట్టారు!
మారువేషంలో 'మంత్రి' పర్యటన
శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు బెంగళూరులోని జయమహల్, ఆర్టీ నగర్, హెబ్బాల్ వంటి పలు ఏరియాల్లో మంత్రి మారువేషంలో తిరిగారు. ఈ పర్యటనలో ఆయనకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి:
స్టాప్‌లో ప్రయాణికుడున్నా ఆపని డ్రైవర్: 'ఫన్ వరల్డ్' బస్ స్టాప్ దగ్గర ఒక ప్రయాణికుడు బస్సు ఆపమని చేయి చూపిస్తున్నా.. డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును స్పీడ్‌గా పోనిచ్చాడు. వెనకాలే గమనిస్తున్న మంత్రి వెంటనే సీరియస్ అయ్యి.. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆటో డ్రైవర్ల ఓవర్ యాక్షన్:
బస్సు దిగాక మంత్రి నాగశెట్టిహళ్లి నుండి కొద్దిదూరం ఆటో ఎక్కారు. అక్కడ మీటర్‌లో రూ. 30 చూపిస్తుంటే, ఆటో డ్రైవర్ రూ. 36 డిమాండ్ చేశాడు. ఎందుకు అని అడిగితే.. "మీటర్ ఖరాబైంది, అంతే కట్టాలి" అన్నాడు. చివరకు మంత్రి రూ. 40 ఇచ్చి దిగేశారు. బెంగళూరులో ఆటోల దోపిడీ ఎలా ఉందో మంత్రికి లైవ్‌గా అర్థమైంది. సామాన్యుల కష్టాలు తెలుసుకోవడానికి మంత్రి చేసిన ఈ 'లైవ్ టెస్ట్' ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది!
