ఈ మధ్య రైల్లో 'సుహాగ్రత్' డెకరేషన్ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో వింత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈసారి కదులుతున్న రైలు బోగీ లోపల కొందరు వ్యక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ కనిపించారు.
ఒక పూజారి కింద కూర్చుని పూజ చేస్తుండగా, తెల్ల బట్టలు వేసుకున్న భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. ఈ వీడియో 'ఎక్స్' లో వైరల్ కావడంతో జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "కదులుతున్న రైల్లో ఇలాంటి మతపరమైన పూజలు చేయడానికి అసలు పర్మిషన్ ఉందా?" అంటూ రైల్వే శాఖను ప్రశ్నించారు.
రైల్వే శాఖ ఇచ్చిన వివరణ..
ఈ వీడియోపై నార్తర్న్ రైల్వే (ఉత్తర రైల్వే) స్పందిస్తూ అసలు విషయం ఏంటో క్లారిటీ ఇచ్చింది. ఈ పూజ జరిగింది సాధారణ ప్యాసింజర్ బోగీలో కాదు. IRCTC ద్వారా ఒకరు ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న ప్రత్యేక 'సెలూన్ కార్' (సెలూన్ బోగీ) లో ఈ కార్యక్రమం జరిగింది.
సెలూన్ కార్ అంటే ఏంటి: ఇది కేవలం విఐపిలు, ఉన్నతాధికారుల కోసం ఉండే ఒక లగ్జరీ బోగీ. ఇందులో ఏసీ బెడ్‌రూమ్‌లు, కిచెన్, డైనింగ్ రూమ్, వాష్‌రూమ్‌లు వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. హోటల్ రూమ్ లాంటి ఈ బోగీని డబ్బులు కట్టి ప్రైవేట్‌గా బుక్ చేసుకోవచ్చు.
జూలై 8న ఒక ప్రైవేట్ పార్టీ ఈ బోగీని బుక్ చేసుకుంది. ఇందుకోసం వారు రూ.3,08,580 అడ్వాన్స్‌గా చెల్లించారు. జూలై 10న న్యూఢిల్లీ నుండి ముంబై వెళ్లే 'పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్' రైలుకు ఈ సెలూన్ కార్‌ను అటాచ్ చేశారు.
భద్రతకు ఎలాంటి ఢోకా లేదు
ఈ పూజ వల్ల రైలు భద్రతకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రైలు సమయపాలన, ప్రయాణికుల రక్షణే మా మొదటి ప్రాధాన్యతని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రైవేట్ బోగీ లోపల మాత్రమే పూజారి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగిందని రైల్వే శాఖ తేల్చి చెప్పింది.
Hello @AshwiniVaishnaw, was this approved by @RailMinIndia? If so, What is the procedure? pic.twitter.com/9VUJP53lJQ
— Mohammed Zubair (@zoo_bear) July 12, 2026
