50 శాతం గుజరాతీ స్టూడెంట్స్ ఇంటర్ చదివేలోపే డ్రాపౌట్.. ఎందుకిలా?

50 శాతం గుజరాతీ స్టూడెంట్స్ ఇంటర్ చదివేలోపే డ్రాపౌట్.. ఎందుకిలా?

గుజరాత్ రాష్ట్రం అనగానే అందరికీ గుర్తొచ్చేది బిజినెస్. లక్షల కోట్ల వ్యాపారాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకునే కాంటాక్స్ ఉన్న పెద్దపెద్ద వ్యాపార సంస్థలు. కానీ చదువు విషయానికి వచ్చేసరికి అక్కడి వాస్తవ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 

గుజరాత్ విద్యా వ్యవస్థపై విడుదలైన తాజా UDISE+ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) నివేదిక ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళన కలిగించే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 53వేల 425 స్కూళ్లలో మొత్తం కోటి 15లక్షల మంది విద్యార్థులు నమోదు అయినప్పటికీ.. 12వ తరగతి వరకు చేరుకునే విద్యార్థుల శాతం కేవలం 54.5 శాతమే ఉందట. అంటే దాదాపు 45.5 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్ చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. జాతీయ సగటు 51.9 శాతంతో పోలిస్తే గుజరాత్ రిటెన్షన్ రేటు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. డ్రాపౌట్ సమస్య మాత్రం ఇంకా తీవ్రంగానే కనిపిస్తోంది.

రిపోర్ట్స్ ప్రకారం.. ప్రాథమిక, ఫౌండేషన్ దశలో విద్యార్థుల నిలకడ 100 శాతం ఉండటం విశేషం. అయితే మధ్య తరగతులకు వచ్చేసరికి ఈ రేటు 90.4 శాతానికి పడిపోగా, సెకండరీ స్థాయిలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ముఖ్యంగా 9, 10 తరగతుల దశలో విద్యార్థులు చదువు మానేయడం ఎక్కువగా నమోదవుతోంది. సెకండరీ స్థాయిలో గుజరాత్ డ్రాపౌట్ రేటు 12.5 శాతంగా ఉండగా, దేశ సగటు కేవలం 7 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఉపాధ్యాయుల లభ్యత విషయంలో గుజరాత్ జాతీయ సగటుతో సమానంగా ఒక్కో పాఠశాలకు సగటున ఏడుగురు టీచర్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఉపాధ్యాయుడిపై 29 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. దేశ సగటు మాత్రం 24 మంది మాత్రమే. రాష్ట్రంలో 58 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాకపోయినా, అక్కడ 74 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. మరోవైపు 2వేల 335 పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తుండగా.. వాటిలో 80 వేలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల నమోదు భారీగా ఉన్నా, వారిని ఉన్నత తరగతుల వరకు కొనసాగించడంలో ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

లెక్కలు జస్ట్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని మాత్రమే కాదు, వారి చదువును ప్రభావితం చేస్తున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, చిన్న వయసులోనే ఉపాధి కోసం వెళ్లాల్సిన పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలల కొరత, విద్యపై అవగాహన లోపం వంటి అంశాలు డ్రాపౌట్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులను పాఠశాలల్లో నిలబెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నప్పటికీ, సెకండరీ స్థాయిలో డ్రాపౌట్‌లను తగ్గించడానికి మరింత సమర్థవంతమైన విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, తల్లిదండ్రుల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు నిరంతర ప్రోత్సాహం అవసరమని విద్యావేత్తలు అంటున్నారు.