ఆయుర్వేదం: ఈ రోగాలకు వంటింట్లోని సరుకులతోనే ముందు తయారు చేసుకోవచ్చు.. ఆస్పత్రికి వెళ్లకుండానే నయం..!

 ఆయుర్వేదం: ఈ రోగాలకు వంటింట్లోని సరుకులతోనే ముందు తయారు చేసుకోవచ్చు.. ఆస్పత్రికి వెళ్లకుండానే నయం..!

ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాలు పడుతుంటే మనసుకెంతో హాయిగా ఉంటుంది. కానీ, ప్రకృతి ఇచ్చే ఈ చల్లదనంతో పాటే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు కూడా ముంచుకొస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో తేమ పెరిగి బ్యాక్టీరియా, వైరస్‌లు పండగ చేసుకుంటాయి. ఫలితంగా ఇంట్లో ఒక్కరికి జలుబు చేసినా, అది చుట్టుపక్కల వాళ్లందరికీ ఈజీగా పాకేస్తుంది.
 
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటేనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు, ఫ్లూ, అజీర్ణం, విరేచనాలు, చర్మ సమస్యలు, మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

అయితే, ఇలాంటి చిన్న పెద్ద సమస్యలు వచ్చిన ప్రతిసారీ హాస్పిటల్‌కు పరుగెత్తకుండా, మన వంటింట్లోని సహజసిద్ధమైన వస్తువులతోనే ఎలా చెక్ పెట్టవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. మన ఇంట్లోనే లభించే చిన్న చిన్న వస్తువులతో ఈ సీజనల్ వ్యాధులను ఎలా తరిమికొట్టవచ్చో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

జ్వరం :
ఒక గ్లాసు నీళ్లలో టీ స్పూన్ ధనియాలు, ఒక లవంగం వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగితే త్వరగా కోలుకుంటారు.

జలుబు:
*చిన్నసైజు రోట్లో గుప్పెడు తులసి ఆకులు, మూడు మిరియాల వేసి రుబ్బాలి. వచ్చిన రసాన్ని వడగట్టి బాటిల్లోకి తీసుకోవాలి. ఒక్కో టీ స్పూన్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
*రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో పసుపు, పుదీనా పూలు వేసి ఆవిరి పట్టాలి.

దగ్గు :
*ఒక వెల్లుల్లి పాయను కొద్దిగా దంచి, నెయ్యిలో వేగించి మింగాలి.
*నాలుగు కిస్మిస్ (ఎండు ద్రాక్ష)లను వేగించి, వాటిపై మిరియాల పొడి చల్లుకుని తినాలి.
*దగ్గు తీవ్రంగా వచ్చినప్పుడు దానిమ్మకాయ తొక్కను ముక్కలుగా చేసి నమలాలి.

కామెర్లు:
*నేల ఉసిరి లేదా గుంటగల్గర ఆకుల పేస్టు మిరియాలతో కలిపి మళ్లీ రుబ్బాలి. దాన్ని చిన్నసైజు ఉండలుగా చేసి, ఆరురోజుల పాటు ఉదయం పరగడుపున తినాలి.

చర్మ వ్యాధులు : 
*స్నానం చేసే నీళ్లలో ఐదారు మామిడి ఆకులు లేదా నేరేడు ఆకులు కలపాలి. గోరువెచ్చని నీళ్లను ఉపయోగిస్తే మంచిది.
*చర్మంపై సమస్య ఉన్నచోట కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పూయాలి.

వాంతులు:
*మాదీఫల రసాయనాన్ని తీసుకోవాలి.
*ఒక టీ స్పూన్ నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

దోమ కాటుకు : 
*వేపాకు లేదా ఆవాలు లేదా నిమ్మగడ్డిని ఆవు పిడకలపై వేసి పొగ వేయాలి. ఇలా రోజూ సాయంత్రం ఆరు గంటలకు చేయాలి.
*దోమలు కుట్టకుండా కాళ్లు, చేతులకు కొబ్బరి నూనె లేదా వేప నూనె రాసుకోవాలి.
*శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా బట్టలు వేసుకోవాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్లీవ్ లెస్ డ్రెస్సులు, షార్ట్లు వేయకపోవడమే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
*వర్షాకాలంలో సులభంగా జీర్ణమయ్యే, తాజాగా వండిన ఆహారాన్ని నెయ్యితో తీసుకోవాలి.
*వంటలో ఎక్కువగా అల్లం వాడాలి. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
*ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్లనే  తీసుకోవాలి. 
*ఫ్రూట్, వెజిటబుల్ సలాడ్లు తీసుకోవద్దు. బాగా ఉడికించినవే తినాలి. ఆలస్యంగా జీర్ణమయ్యే ఆకుకూరలు, పెరుగు వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.
*పగటిపుట నిద్ర అనేది ఈ కాలంలో మంచిది కాదు.
*పరిసరాలు శుభ్రంగా, పొడిగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లోని ప్రతిగదిలో గాలి బాగా ఆడేలా చూసుకోవాలి.
*తడిగా ఉన్న బట్టలను వీలైనంత త్వరగా మార్చేసుకోవాలి.

విరేచనాలు:
*ఒక టీ స్పూన్ మెంతులను ఒక కప్పు పెరుగులో వేసుకుని తినాలి. విరేచనాలు తగ్గిపోయే వరకు ఇలా చేయాలి.
*దానిమ్మ రసం విరేచనాలను తగ్గిస్తుంది.
*మజ్జిగలో చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ చక్కెర వేసుకుని తాగాలి.