కేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవ్.. ఫాంహౌస్ నుంచి  బయటకు వచ్చింది మనవడి కోసమే.. ప్రజల కోసం కాదు: మంత్రి వివేక్

కేసీఆర్ కు ప్రజా సమస్యలు పట్టవ్.. ఫాంహౌస్ నుంచి  బయటకు వచ్చింది మనవడి కోసమే.. ప్రజల కోసం కాదు: మంత్రి వివేక్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వివేక్...  చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్ వదిలి బయటకు వచ్చింది కేవలం తన మనుమడి కోసమే తప్ప, ప్రజల కోసం కాదని మంత్రి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు కోరినా.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏనాడూ ప్రజా సమస్యలపై మాట్లాడలేదని మండిపడ్డారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలకు మంత్రి వివేక్  కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుల నుంచి నీటిని పంప్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని... అసలు పంప్ చేయడమే అంత సులువైతే అంత ఖర్చు పెట్టి బ్యారేజీలు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏమీ ఇంజనీర్ కాదని... సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు ఏమీ చేయవద్దని స్పష్టం చేశారు. చేతనైతే డిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

కేటీఆర్, హరీష్ రావు రాత్రింబగళ్లు కేవలం పబ్లిసిటీ కోసమే పాకులాడుతున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో కల్వకుంట్ల కుటుంబం కేవలం ఆస్తులు, కమీషన్ల కోసమే పరిపాలన సాగించిందని ఆరోపించారు. కవిత గతంలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... మీకు 1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడడం లేదని... దీనిపై రాజకీయం చేయకుండా ఏం చేద్దామనేదానిపై కలిసి రావాలని కోరారు.

సిరిసిల్లలో 3500 ఇళ్లకు గానూ గత ప్రభుత్వం కేవలం 2500 ఇళ్లు మాత్రమే కట్టిందని... బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదలకు ఇళ్లు ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. నేతన్నల నియోజకవర్గమైన సిరిసిల్ల నిరుద్యోగుల కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇక్కడి ఐటీఐ ట్రైనింగ్ లో ఉన్నవారికి జర్మనీకి చెందిన 'టామ్ టామ్' సంస్థ ద్వారా దాదాపు 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.