AI కోసం 9వేల మంది స్పెషల్ ఇంజనీర్లను దింపిన TCS.. వీళ్లు ఏం చేస్తారో తెలుసా?

AI కోసం 9వేల మంది స్పెషల్ ఇంజనీర్లను దింపిన TCS.. వీళ్లు ఏం చేస్తారో తెలుసా?

ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందనే చర్చ జరుగుతున్న సమయంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. AI వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయని, అవుట్‌సోర్సింగ్ వ్యాపారం దెబ్బతింటుందని చాలా మంది భావిస్తున్న వేళ.. టీసీఎస్ మాత్రం దీనిని కొత్త అవకాశంగా చూస్తోంది. అందుకే AI సేవలను మరింత వేగంగా విస్తరించేందుకు భారీ స్థాయిలో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్ల(FDE) రిక్రూట్మెంట్ కి సిద్ధమైంది. సంస్థలో మొత్తం ఉద్యోగుల్లో 1 నుంచి 1.5 శాతం వరకు FDEలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 8వేల 900 మంది కొత్త ఇంజినీర్లను నియమించాలని టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ వెల్లడించారు. ప్రస్తుతం టీసీఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5లక్షల 94వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

గత కొంతకాలంగా AI టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ప్రపంచ ఐటీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు కొత్త AI మోడళ్లను విడుదల చేస్తున్న ప్రతిసారీ సాఫ్ట్‌వేర్ సేవల భవిష్యత్తుపై చర్చ మొదలవుతోంది. SaaS రంగంలో మందగమనం, ఖర్చుల కోతలు, ఉద్యోగాల తొలగింపులు ఐటీ కంపెనీలను ప్రభావితం చేశాయి. టీసీఎస్ కూడా గతంలో వేలాది ఉద్యోగులను తొలగించినప్పటికీ.. ఇప్పుడు AIను భయపడకుండా దాన్నే వ్యాపార వృద్ధికి ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. AIతో పాటు డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా కొత్త కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.

ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్ పాత్ర ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో ఒకటిగా మారింది. వీరి పని కేవలం AI టూల్‌ను ఇన్‌స్టాల్ చేయడం కాదు. క్లయింట్ సంస్థలో ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్, డేటా, వ్యాపార విధానాలను పూర్తిగా అర్థం చేసుకుని, వాటికి సరిపోయే విధంగా AI వ్యవస్థలను అనుసంధానం చేయడం వీరి బాధ్యత. ఉదాహరణకు ఒక బ్యాంకు కస్టమర్ సర్వీస్‌ను AIతో మెరుగుపరచాలనుకుంటే.. ఆ బ్యాంక్ సిస్టమ్‌ను విశ్లేషించి, సూట్ అయ్యే AI మోడల్‌ను పనిలోకి తీసుకురావటంలో FDE కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు కూడా ప్రత్యేకంగా FDE బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ ఉద్యోగాలకు అంతర్జాతీయంగా భారీ వేతనాలు కూడా లభిస్తున్నాయి. గూగుల్ క్లౌడ్ అమెరికాలో FDEలకు సంవత్సరానికి కోటి 46లక్షల రూపాయల నుంచి 2కోట్ల 12లక్షల రూపాయల వరకు బేసిక్ పే ఆఫర్ చేస్తుండగా, ఓపెన్‌ఏఐలో ప్యాకేజ్ సుమారు కోటి 89లక్షల నుంచి 3కోట్ల 20లక్షల రూపాయల వరకు ఉంది. దీంతో ఈ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. టీసీఎస్ ఇప్పటికే ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుని సంస్థలో ChatGPT Enterpriseను ఉపయోగిస్తోంది. AI అవుట్‌సోర్సింగ్ రంగాన్ని భర్తీ చేయదని, దానిని మరింత బలోపేతం చేస్తుందని టీసీఎస్ విశ్వసిస్తోంది. క్లయింట్ అవసరాలను లోతుగా అర్థం చేసుకుని AIని సమర్థంగా అమలు చేయగల నైపుణ్యం తమకు ఉందని కంపెనీ చెబుతోంది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని కూడా AI భారతీయ ఐటీ కంపెనీలను భర్తీ చేయదని, వేగంగా మార్పులకు అనుగుణంగా ముందుకు సాగే సంస్థలకు ఇదో మరింత అవకాశాలను అందిస్తుందన్నారు.