రైలు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో వచ్చే చిరాకు తెప్పించే క్యాప్చా కోడ్‌లు, యాడ్స్ (పాప్-అప్‌ల) ఇబ్బందులకు త్వరలోనే ముగింపు పడనుంది. భారతీయ రైల్వే జూలై 15న అధికారిక వెబ్‌సైట్‌కు సంబంధించిన లేటెస్ట్ ‘బీటా వెర్షన్’ (కొత్త రూపం)ను ప్రారంభించబోతోంది. దీనివల్ల ప్రయాణికులు చాలా సులభంగా, అతి తక్కువ టైంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు....
ఈ కొత్త వెబ్‌సైట్‌లో వచ్చే 4 ముఖ్య మార్పులు ఇవే:
క్యాప్చా, పాప్-అప్‌లు బంద్: సాధారణంగా తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు క్యాప్చా ఎంటర్ చేయడానికే టైం అంతా అయిపోతుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కొత్త వెబ్‌సైట్‌లో క్యాప్చా, పాప్-అప్ యాడ్స్ పూర్తిగా తీసేస్తున్నారు.
ఒకే స్క్రీన్‌పై సీట్ల వివరాలు: ఇంతకుముందు ఏ క్లాస్ (స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ) సీట్లు ఖాళీగా ఉన్నాయో చూడాలంటే విడివిడిగా క్లిక్ చేయాల్సి వచ్చేది. ఇకపై అన్ని క్లాసుల సీట్ల లభ్యత (Availability) ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫాస్ట్ బుకింగ్ & సేవ్డ్ డీటెయిల్స్: టికెట్ బుకింగ్ ప్రాసెస్ స్టెప్స్ చాలా వరకు తగ్గుతాయి. గతంలో మనం సేవ్ చేసుకున్న ప్రయాణికుల వివరాల ఆధారంగా మరింత వేగంగా, సింగిల్ క్లిక్‌తో బుకింగ్ చేసుకునేలా కొత్త ఫీచర్ రాబోతోంది.
40 ఏళ్ల నాటి పాత సిస్టమ్‌కు గుడ్ బై: 1986లో ప్రవేశపెట్టిన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో, సరికొత్త అత్యాధునిక టెక్నాలజీని రైల్వే శాఖ తీసుకురాబోతోంది.
విద్యార్థుల ఐడియా.. మంత్రి యాక్షన్!
కొన్ని వారాల క్రితం జైపూర్‌కు చెందిన ఎంఎన్‌ఐటీ (MNIT) కాలేజ్ విద్యార్థులు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ప్రస్తుత IRCTC వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్ ఎంత కష్టంగా ఉందో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఆయనకు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన రైల్వే మంత్రి, జూలై 15 లోగా వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. మాట్లాడినట్లే వెబ్‌సైట్ మార్చేసిన రైల్వే శాఖ.. ఆ కొత్త వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుందో చూపించడానికి అదే కాలేజీ విద్యార్థులను ప్రత్యేకంగా పిలిచి లైవ్ డెమో ఇచ్చింది. ఇంకా వాళ్ల సలహాలు కూడా తీసుకుంది.
బాట్లకు బ్రేక్
తత్కాల్ టికెట్లను ఆటోమేటిక్‌గా బుక్ చేసే సాఫ్ట్‌వేర్ బాట్లు, ఏజెంట్ల దందాను అరికట్టడానికి కూడా ఈ కొత్త వెబ్‌సైట్‌లో కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ కొత్త మార్పులతో సామాన్య ప్రయాణికులకు టికెట్ల బుకింగ్ భారం చాలా వరకు తగ్గనుంది.
