కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆ ఇద్దరూ ఓ ఇంట్లోకి అడుగుపెట్టారు. కానీ, కలిసి జీవించడం మొదలుపెట్టిన కేవలం మూడు రోజులకే ఆ ఇల్లు ఒక ఘోరనికి సాక్ష్యంగా నిలిచింది. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ఆ యువకుడు.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తను కూడా రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
కట్ అయిపోయిన ఫోన్ కాల్స్.. తలుపులు పగలగొడితే రక్తపు మడుగులో..
ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఇషారా అయూబి అనే యువతి గురుగ్రామ్‌లోని సెక్టార్ 55లో ఓ అద్దె ఫ్లాట్‌లో ఉంటోంది. రోజులాగే కూతురితో మాట్లాడదామని తల్లిదండ్రులు ఫోన్ చేశారు. కానీ, అటువైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. వరుసగా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబికుల్లో ఆందోళన మొదలైంది. ఏదో జరిగిందని వారు వెంటనే సెక్టార్ 56 పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఇషారా ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకునేసరికి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా పలకకపోవడంతో పోలీసులు గట్టిగా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసులే షాకయ్యారు. ఇషారా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఎవరో ఆమెను కత్తితో పదే పదే పొడిచి కిరాతకంగా చంపేశారు.
అక్కడ ప్రియురాలి శవం.. ఇక్కడ రైల్వే ట్రాక్‌పై ప్రియుడి మృతదేహం
ఈ హత్య ఎవరు చేసుంటారనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రేష్ఠ్ మాలిక్ అనే యువకుడి వివరాలు బయటకు వచ్చాయి. ఇషారా, మాలిక్ ఇద్దరూ స్నేహితులు. పోలీసులు మాలిక్ కోసం వెతుకుతుండగానే, గర్హి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక యువకుడి మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది.
అక్కడ దొరికిన ఒక మొబైల్ ఫోన్ ఆధారంగా.. ఆ మృతదేహం మాలిక్‌దేనని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ రెండు ఘటనల లింక్ బయటపడింది. ఇషారాను దారుణంగా హత్య చేసిన తర్వాత, తీవ్ర ఆందోళనతో లేదా భయంతోనో మాలిక్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలు ఆ మూడు రోజుల్లో ఏం జరిగింది?
ప్రాథమిక విచారణలో తెలిసిన విషయం ఏంటంటే.. ఈ ఘోరం జరగడానికి కేవలం మూడు రోజుల ముందే ఇషారా, మాలిక్ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో (Live-in) ఉండడం ప్రారంభించారు.
ఎంతో ఇష్టపడి, కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఆ మూడు రోజుల్లోనే వారి మధ్య అంతటి దారుణానికి దారితీసే గొడవ ఏం జరిగింది? అంతవరకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిపై ఎందుకంత కోపం, హత్య తర్వాత ప్రాణాలు తీసుకునేంత ఆవేశం మాలిక్‌కు ఎందుకు వచ్చింది ? అనే ప్రశ్నలు ఇప్పుడు మిస్టరీగా మారాయి.
ప్రస్తుతం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కుటుంబిలకు సమాచారం అందించారు. వారిద్దరి మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులు, చాటింగ్ హిస్టరీలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. సాంకేతిక ఆధారాల ద్వారానే ఈ జంట ఇంత విషాదాంతం కావడానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
