ఇవాళ(జులై13) తెలంగాణ వ్యాప్తంగా.. పిల్లలకు నట్టల మందు పంపిణీ  

ఇవాళ(జులై13) తెలంగాణ వ్యాప్తంగా.. పిల్లలకు నట్టల మందు పంపిణీ  
  • 96.81 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు
  •     రాజ్‌‌ భవన్ స్కూల్‌‌లో ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
  •     1 నుంచి 19 ఏండ్లలోపు వారందరికీ పంపిణీ

హైదరాబాద్, వెలుగు: పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను తరిమికొట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని’ (నేషనల్ డీవార్మింగ్ డే) నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1 నుంచి 19 ఏండ్ల వయస్సు గల 96,81,855 మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలను పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌‌లోని రాజ్‌‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

అంగన్‌‌వాడీలు, స్కూళ్లు, కాలేజీలలో..

విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, అంగన్‌‌వాడీ సెంటర్లలో ఒకే రోజు మాత్రల పంపిణీ చేపడతారు. ఒకవేళ సోమవారం మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లల కోసం జులై 20న ‘మాప్ -అప్ డే’ నిర్వహిస్తామని, ఆ రోజు తప్పనిసరిగా మాత్ర వేస్తామని అధికారులు వెల్లడించారు.

నులిపురుగులతో డేంజర్: మంత్రి దామోదర 

పిల్లల ఎదుగుదలలో నులిపురుగులు అడ్డంకిగా మారుతాయని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ‘‘నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి పిల్లలు బలహీనపడతారు. దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు మాత్ర వేయించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం మాత్రలతోనే కాకుండా.. చేతులు కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం వంటి అలవాట్లపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటికి తీసుకెళ్లొద్దు.. అక్కడే వేసుకోవాలి: సంగీత సత్యనారాయణ


హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ‘‘ఆల్బండజోల్ మాత్రలను ఇంటికి పంపకూడదు. స్కూల్, అంగన్‌‌వాడీ సెంటర్‌‌‌‌లో నిపుణుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. మాత్ర వేసే ముందు పిల్లలు ఏదైనా ఆహారం తిని ఉండాలి. ఖాళీ కడుపుతో మాత్ర ఇవ్వకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. బడికి వెళ్లని పిల్లలను ఆశా వర్కర్లు గుర్తించి అంగన్‌‌వాడీ సెంటర్లకు తీసుకురావాలని సూచించారు.