షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నర రూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరు మండలం పెంజెర్లలోని ఓ వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పెంజెర్లలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గమనార్హం.
తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకొని సైకోలా మారిన రాజ్ కుమార్ మారణహోమం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్ల ముందే ఆమె తల్లిని, నానమ్మను పొడిచి చంపాడు. అక్కడి నుంచి బాలికను కారులో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి.. తన సొంత భార్యా పిల్లల గొంతుకోశాడు. ‘‘ఆరుగురినీ చంపేశాను.. నేనూ చస్తున్నాను’’ అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి, మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత.. స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది.
శుక్రవారం రాత్రి సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకున్నాడు. రాత్రి 11.10 గంటలకు బాలిక ఇంటికి వచ్చాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్ ఓపెన్ చేసింది. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో తల్లి అడ్డుపడింది. దీంతో తన చేతిలో కత్తితో కడుపు, ఛాతిలో ఆరు పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.
సమీపంలోని అఖిల్‌సాగర్ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతుకోశాడు. పక్కనే బెడ్‌పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్ గొంతులు కోశాడు. ఇలా రాత్రి 11.10 గంటల నుంచి 11.45 గంటల మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలో ఆరు ప్రాణాలను తీశాడు.
