ఓటు అక్కడా.. ఇక్కడా..: ఆంధ్రా సెటిలర్లలో హై టెన్షన్.. రాజకీయ ప్రయోజనాలా.. వ్యక్తిగతమా..?

ఓటు అక్కడా.. ఇక్కడా..: ఆంధ్రా సెటిలర్లలో హై టెన్షన్.. రాజకీయ ప్రయోజనాలా.. వ్యక్తిగతమా..?

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఏపీలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ ముగుస్తుండటంతో.. ఏపీలో ఓటు ఉంచుకోవాలా లేదా.. ఏపీలో ఓటును ఉంచాలా.. తీసివేయాలా అనే టెన్షన్లో పడ్డారు. కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ప్రగతినగర్, నిజాంపేట, మియాపూర్, బీహెచ్ఈఎల్, బాచుపల్లి, అశోక్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ఇలాంటి ఏరియాల్లో ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తుంది.

ఏ ఇద్దరిని కదిలించినా.. SIR.. నీ ఓటు ఎక్కడ బాసూ.. అక్కడా.. ఇక్కడా.. ఎక్కడా అనే మాటలే నడుస్తున్నాయి. తెలంగాణలో ఎన్ రోల్ మెంట్ కు జూలై 25వ తేదీ వరకు సమయం ఉండగా.. ఏపీలో మాత్రం జూలై 14వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలోని ఆయా గ్రామాల నుంచి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కొందరు రాజకీయ నాయకులు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారంట.

ఏపీలో ఓటు ఉండి హైదరాబాద్ లో స్థిర నివాసం ఉన్నోళ్లు బాగా డైలమాలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటూ సంక్రాంతి, దసరా పండగలకు సొంతూరు వెళ్లి వచ్చే వాళ్లు తెలంగాణలోనే ఓటు ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఓటు లేకపోతే ఎవరు పట్టించుకుంటారనే భావన కొందరిలో నెలకొంది. అలా అని ఏపీలో ఓటు లేకపోతే సొంతూరులో.. అక్కడి రాజకీయంతో.. అక్కడి వ్యవహారాలతో సంబంధాలు కట్ అవుతాయనే బాధా ఉంది. ఇలాంటి అంశాలతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు.. ముఖ్యంగా రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్లు మనోవేదన పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో జులై 14వ తేదీతో SIR మొదటి విడత ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ ముగుస్తుండటంతో హైదరాబాద్ సిటీలోని కొందరు ఆంధ్రా సెటిలర్లు ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్లోని ఆంధ్రా సెటిలర్లలో చాలా మంది తెలంగాణలో, ఆంధ్రాలో.. రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటూ వచ్చారు. కానీ.. ఇకపై ఆ పప్పులు ఉడకవు. రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తేలితే ఏడాది జైలు ఖాయమని తెలంగాణ ప్రధాన ఎన్నికల సంఘం ఇప్పటికే హెచ్చరించింది.

►ALSO READ | మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీ విద్యార్థులకు ప్రత్యేక మెగా జాబ్ మేళా

దీంతో.. కొందరు ఆంధ్రా సెటిలర్లు చేసేదేమీ లేక హైదరాబాద్లో ఓటుకు మంగళం పాడి ఆంధ్రాలోని తమ సొంతూరిలో ఓటు హక్కును నిలుపుకుంటున్నారు. మరికొందరు ఆంధ్రా సెటిలర్లు మాత్రం.. హైదరాబాద్లో ఓటు హక్కు ఉండకపోతే స్థానికంగా తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని.. అలా అని సొంతూరిలో ఓటుకు స్వస్తి చెప్పి హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకుంటే సొంతూరిలో తమను చులకనగా చూస్తారని.. ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు చోట్లా ఓట్లు వినియోగించుకునే అవకాశాల కోసం అన్వేషిస్తు్న్నారు.

అయితే.. ఇకపై రెండు చోట్ల ఓట్లు కొనసాగించడం ఇకపై అంత సులువు కాదు. గతంలో ఓటర్ల తనిఖీలు కేవలం రాష్ట్ర పరిధికే పరిమితం కాగా, ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించి ‘ఎరోనెట్' ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఒక ఓటరుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందో లేదో సరిచూస్తారు. డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఆన్లైన్ ద్వారా సులభంగా గుర్తించి తొలగించవచ్చు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వివరాలను కూడా దీని ద్వారా నిశితంగా ధ్రువీకరిస్తారు. ఇది ఓటర్ల జాబితాలో అవకతవకలను అరికట్టేందుకు ఒక పెద్ద విప్లవాత్మక మార్పుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండే అవకాశమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా ఓటు నమోదు చేయించుకున్నా ఈ టెక్నాలజీతో సులభంగా పట్టుబడనున్నారు.