న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధుల గోల్ మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రామమందిర విరాళాల చోరీ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ట్రస్ట్‌ను ఆదేశించింది. అలాగే, అయోధ్య విరాళాల చోరీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోన్న సిట్‌ను.. కేసుకు సంబంధించిన దర్యాప్తు స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అయిన పవిత్ర అయోధ్య రామమందిరంలో విరాళాలు, నిధుల గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిర విరాళాల చోరీపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం (జులై 13) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అయోధ్య విరాళాల చోరీకి సంబంధించి దాఖలైన పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అలాగే, విరాళాల చోరీ కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సిట్‌ను కూడా ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున హాజరైన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిట్ స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను 2026, జులై 20వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
