జులై 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ సారె’ సమర్పణ ఉత్సవాలు

జులై 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ సారె’ సమర్పణ ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి 'సారె సమర్పణ' మహోత్సవాలకు దేవస్థానం సర్వసిద్ధమైంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూ లైన్ల నిర్వహణను ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులతో కలిసి సోమవారం (జులై 13) క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. ఆషాఢ సారె సమర్పణకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక, పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈసారి శ్రీ కనకదుర్గ నగర్‌లోనే క్లోక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్ (చెప్పుల స్టాండ్), మొబైల్ ఫోన్లు భద్రపరుచుకునే పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

​సారె సమర్పణ, దర్శన ప్రణాళిక ఇలా:

సారె సమర్పించే భక్తుల బృందాలు మొదట శ్రీ కనకదుర్గ నగర్‎లో తమ పేర్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, నమోదు ఫారం (స్లిప్) తీసుకున్న అనంతరం క్యూ మార్గం ద్వారా మహామండపం ర్యాంప్ మీదుగా 7వ అంతస్తులోకి ప్రవేశిస్తారు.​ అక్కడి నుండి భక్తులను శ్రీ భవాని అనుగ్రహ దర్శన్ (రూ. 100/-) క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.​

►ALSO READ | టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.4.41 కోట్ల భారీ విరాళం

దర్శనానంతరం భక్తులు మహామండపం 6వ అంతస్తులో తాము తెచ్చిన సారెను సమర్పించి, అక్కడ ఆ రిజిస్ట్రేషన్ స్లిప్ చూపించి ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం అందుకుంటారు. అనంతరం 2వ అంతస్తులో అన్నప్రసాదం స్వీకరించి క్రిందికి వెళ్లేలా సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశామన్నారు.