దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ LIC వినియోగదారులకు కీలక మార్పు చేసింది. LIC అధికారిక వెబ్‌సైట్ కస్టమర్ పోర్టల్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే సదుపాయం తొలగించింది. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి డిజిటల్‌గా ప్రీమియంలు చెల్లించే పాలసీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చెల్లింపు మార్గాలు ఇవే
LIC ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను తొలగించడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏజెంట్ల ద్వారా, LIC శాఖల్లో కూడా ప్రీమియం చెల్లించే అవకాశం కొనసాగుతోంది.
బిల్‌డెస్క్ ఛార్జీలే కారణమా?
క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఆప్షన్ తొలగింపుకు పేమెంట్ గేట్‌వే సంస్థ వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలే కారణమని కొందరు LIC ఏజెంట్లు చెబుతున్నారు. LIC ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించిన బిల్‌డెస్క్ సేవలపై ఛార్జీల విషయంలో LIC, పేమెంట్ గేట్‌వే సంస్థ మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు అదనపు సౌకర్య రుసుము ఉండేదని LIC వెబ్‌సైట్‌లో గతంలో పేర్కొనగా.. డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు లేవని సంస్థ తెలిపింది.
ALSO READ : మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా?
త్వరలో తిరిగి వచ్చే అవకాశం?
చెల్లింపుల కోసం మరో పేమెంట్ గేట్‌వే సంస్థతో LIC అధికారులు చర్చలు జరుపుతున్నారని ఏజెంట్లు చెబుతున్నారు. కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే క్రెడిట్ కార్డ్ చెల్లింపు సదుపాయం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ అంశంపై LIC నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇన్సూరెన్స్ దిగ్గజం నుంచి క్లారిటీ వచ్చేవరకూ పాలసీదారులు యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.
