తండ్రి కోసం కొడుకు త్యాగం.. సీఎం విజయ్ 'జన నాయగన్' కోసం వెనక్కి తగ్గిన జేసన్ సంజయ్ 'సిగ్మా'!

తండ్రి కోసం కొడుకు త్యాగం.. సీఎం విజయ్ 'జన నాయగన్' కోసం వెనక్కి తగ్గిన జేసన్ సంజయ్ 'సిగ్మా'!

తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ హీరో దళపతి నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వివాదాల తర్వాత ఇటీవల సెన్సార్ పక్రియ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై  24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి వస్తుండటంతో .. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతోంది.

తండ్రి కోసం కొడుకు త్యాగం..?

దర్శకుడిగా జేసన్ సంజయ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'సిగ్మా' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ హైస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తొలుత జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తన తండ్రి విజయ్ 'జన నాయగన్' విడుదలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో రెండు సినిమాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు 'సిగ్మా'ను ఆగస్టుకు వాయిదా వేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

హీరోగా జేసన్ సంజయ్ ఎంట్రీ..

మరోవైపు జేసన్ సంజయ్ దర్శకుడిగానే కాకుండా త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ నిర్మాత జీకేఎం తమిళ్ కుమరన్ నిర్మాణంలో జేసన్ హీరోగా ఓ కొత్త సినిమా రూపుదిద్దుకునే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

బారీ అంచనాలతో 'సిగ్మా'

'సిగ్మా' చిత్రాన్ని తమిళనాడు, థాయ్‌లాండ్‌లలో భారీ స్థాయిలో చిత్రీకరించారు. ట్రెజర్ హంట్, హైస్ట్ యాక్షన్, కామెడీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా, ఎస్. థమన్ సంగీతం అందించారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవల సందీప్ కిషన్ కూడా జేసన్ సంజయ్ పనితీరును ప్రశంసిస్తూ.. వయసు తక్కువైనా కథపై అతనికి అసాధారణమైన క్లారిటీ ఉంది. ప్రీ-ప్రొడక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి అంశాన్ని ఎంతో ఓర్పుతో ప్లాన్ చేశాడు అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 'జన నాయగన్'విడుదలతో పాటు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంతటి విజయాన్ని అందుకుంటాడో, అలాగే హీరోగా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.