లక్నో: ఇలాంటి ఘటనలు చూసినప్పుడే మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోయిందనిపిస్తుంది. ఓ పాతికేళ్ల యువకుడు నడిరోడ్డుపై తీవ్ర గాయాలతో నన్ను రక్షించడంటూ దాదాపు 40 నిమిషాల పాటు సహయం కోసం వేడుకున్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. అయ్యో అని జాలి తలచి ఒక్కరూ కూడా అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి చివరకు రోడ్డుపైన యువకుడు ప్రాణాలు విడిచాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం మరింత శోషనీయం. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రాజ్ కుమార్ (25) ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు వెళ్లాడు. దొరికిన పని చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో, 2026, జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో రాజ్ కుమార్‌కు వాగ్వాదం తలెత్తింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్ రాజ్ కుమార్‌పై దాడికి పాల్పడ్డాడు.
భయాందోళనకు గురైన రాజ్ కుమార్ ప్రాణరక్షణ కోసం సమీపంలోని పోలీస్ పింక్ బూత్ (మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సహాయ కేంద్రాలు) దగ్గరకు పరిగెత్తాడు. పోలీస్ పింక్ బూత్ క్లోజ్ చేసి ఉండటంతో లోపల ఉన్న సిబ్బందిని పిలిచేందు బూత్ గ్లాస్ డోర్‌ను గట్టిగా కొట్టాడు.
దీంతో గాజు పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రాజ్ కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు పోలీస్ పింక్ బూత్ ఎదుటే సహయం కోసం వేడుకున్నాడు. కానీ అందులోని మహిళా పోలీసులు ఎవరూ బయటకు రాలేదు. స్థానికులు కూడా ఎవరూ అతడిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర రక్తస్రావమే రాజ్ కుమార్ రోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ఆటో డ్రైవర్, రాజ్ కుమార్ ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడ్డారని.. ఈ ఘర్షణలో రాజ్ కుమార్ గాయపడ్డాడని తెలిపారు. గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
