యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడగాల్పులకు..వారంలో 10 వేల మంది బలి

యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడగాల్పులకు..వారంలో 10 వేల మంది బలి
  • అందులో 9 వేల మందికిపైగా 65 ఏళ్లు పైబడినవారే
  • ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య అత్యధికం
  • వాతావరణ మార్పులే ప్రధాన కారణమంటున్న సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

బ్రస్సెల్స్: యూరప్‌‌‌‌‌‌‌‌లో తీవ్ర వడగాల్పుల వల్ల జూన్ చివరి వారంలో ఏకంగా 10,650 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌ఓ) సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తున్న యూరోమోమో అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ జూన్ 22 నుంచి 28 మధ్య యూరప్‌‌‌‌‌‌‌‌లోని 27 దేశాల నుంచి సేకరించిన జాతీయ మరణాల గణాంకాల ఆధారంగా ఒక నివేదికను రూపొందించింది. 

అందులో ఈ వారం రోజుల్లో యూరప్‌‌‌‌‌‌‌‌లోని లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సిలోనా, రోమ్, మిలాన్, ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ఫర్ట్, లిస్బన్, ఏథెన్స్, బుడాపెస్ట్, జాగ్రెబ్, సస్సరి నగరాల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైనట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌ దాటాయి. ఇదేవారంలో సాధారణ పరిస్థితులతో పోలిస్తే 10,650 అదనపు మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలకు ప్రధాన కారణం తీవ్రమైన వడగాల్పులేనని పరిశోధకులు స్పష్టం చేశారు. మొత్తం మృతుల్లో 9 వేల మందికి పైగా 65 ఏళ్లు పైబడిన వారే ఉండడం గమనార్హం. 

వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవడం వల్లే వీరంతా మృతి చెందారని డాక్టర్లు చెప్తున్నారు. దేశాల వారీగా చూస్తే ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. బెల్జియంలో 2000 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో ఎండల వల్ల మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మరో అధ్యయనం ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్‌‌‌‌‌‌‌‌లో మే–జూన్ నెలల్లో సంభవించిన వడగాల్పుల వల్ల సుమారు 2,700 మంది ప్రాణాలు కోల్పోయిట్లు తేలింది. 

జూన్ చివరి వారంలో ఇంత తీవ్రమైన వేడిగాలులా..

ఈ విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల భూమి వేడెక్కడం జరగకపోతే, జూన్ చివరలో ఇటువంటి తీవ్రమైన వేడిగాలులు సంభవించడం ‘అసాధ్యం’ అని వారు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరిన్ని సంభవించే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించే కఠిన చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇటువంటి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వృద్ధులను పర్యవేక్షించేందుకు కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లను పటిష్టం చేయడం, అత్యవసర కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, నగరాల్లో గాలి ధారాళంగా ఆడేలా పట్టణ ప్రణాళికలను రూపొందించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.