బాల్కొండ: మా రక్తం తీసుకోండి.. కానీ రైతులకు నీళ్లివ్వండి..ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రక్తంతో మాజీ మంత్రి వేముల నిరసన

బాల్కొండ: మా రక్తం తీసుకోండి.. కానీ రైతులకు నీళ్లివ్వండి..ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రక్తంతో మాజీ మంత్రి వేముల నిరసన

బాల్కొండ, వెలుగు: తెలంగాణలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి ఆయన రక్తదానం నిరసన చేపట్టారు. ‘మా రక్తం తీసుకోండి.. రైతులకు మాత్రం నీళ్లివ్వండి’ అంటూ స్వయంగా రక్తదానం చేసి నిరసన తెలిపారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ ఆఫీసర్లకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని కోరారు. 

వర్షాభావంపై సీఎంను ప్రశ్నించిన విలేకరితో వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయా? అని వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఎమ్మెల్యే.. సీఎం అడిగినట్లుగానే తనతో పాటు బాల్కొండ రైతులు రక్తం ఇస్తున్నామని, ఇప్పటికైనా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌‌లు రివర్స్ పంపింగ్‌‌కు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపాలని సూచించారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ లో 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతులకు నీరు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

రైతులకు నీళ్లివ్వమంటే.. నెత్తురు చల్లమంటారా?

జగిత్యాల టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రైతుల నెత్తురు పీల్చే జలగలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్​అయ్యారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత, బీఆర్‌‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సోమవారం రాత్రి జగిత్యాలలో ధర్నా చేశారు. జీవన్ రెడ్డి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి, ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. అనంతరం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి సీఎంపై ఫిర్యాదు చేశారు.