అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కార్పొరేట్ సలాం..మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర

అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కార్పొరేట్ సలాం..మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర
  •    మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర
  •     మెగా జాబ్ మేళాకు 2,500 మంది విద్యార్థులు
  •     30కి పైగా ప్రముఖ కంపెనీల సందడి

హైదరాబాద్, వెలుగు: యువతకు సాంకేతిక నైపుణ్యాలతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 30 అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో కోర్సులు పూర్తి చేసుకున్న అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోయింగ్ విద్యార్థుల కోసం ఈ భారీ ఉపాధి వేదికను ఏర్పాటు చేశారు.


 ఈ మేళాకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించగా దాదాపు 2,500 మందికి పైగా ఏటీసీ పాస్‌‌వుట్ విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన ఈ అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలించడానికి దేశవ్యాప్తంగా పేరుగాంచిన 30కి పైగా ప్రముఖ కంపెనీల హెచ్‌‌ఆర్ ప్రతినిధులు తరలివచ్చారు. రోబోటిక్స్, ఈవీ, సీఎన్‌‌సీ మెషినింగ్ వంటి కోర్సుల అభ్యర్థులకు కంపెనీలు భారీగా ప్రాధాన్యతనిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు ఏ రకంగా సత్ఫలితాలను ఇస్తున్నాయో ఈ మెగా జాబ్ మేళా విజయవంతం కావడమే నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు కొనియాడాయి.

ఫ్రెషర్స్ ప్యాకేజీలతో కార్పొరేట్ కంపెనీల పోటీ 

ఈ మెగా జాబ్ మేళాలో దేశీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దిగ్గజ కార్పొరేట్ సంస్థలు పోటాపోటీగా పాల్గొని విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలను ఆఫర్ చేశాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ పూణే గుజరాత్ లొకేషన్ల కోసం అన్ని ట్రేడుల విద్యార్థులకు నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాన్ని ప్రకటించి భారీగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంది. అదేవిధంగా హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ రక్షణ, విమానయాన రంగ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విద్యార్థుల నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ. 17 వేల నుంచి గరిష్టంగా రూ. 25 వేల వరకు అత్యధిక ప్యాకేజీని అందించి ఆకర్షించింది. జిందాల్ కార్పొరేషన్ సంస్థ హైదరాబాద్ లొకేషన్ కోసం నెలకు రూ.12 వేల వేతనంతో పాటు ఉచిత వసతి ఇతర ప్రయోజనాలను కల్పించడానికి ముందుకు వచ్చింది. అటు యాక్సిస్ గ్లోబల్ ఆటోమేషన్ సంస్థ తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి పలు రాష్ట్రాల్లోని తమ ప్లాంట్ల కోసం నెలకు రూ.16 వేల వేతనంతో పాటు వసతి సౌకర్యాలను ఆఫర్ చేసింది. ఈ నాలుగు ప్రధాన కంపెనీలతో పాటు మరో 15 నుంచి 20 ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం నిరుద్యోగ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపింది.

అత్యాధునిక కోర్సులకు పెరిగిన డిమాండ్

ఈ జాబ్ మేళాలో మొత్తం ఆరు రకాల అడ్వాన్స్‌‌డ్ కోర్సులకు చెందిన 2,265 మంది అర్హులైన విద్యార్థులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ కోర్సు నుంచి అత్యధికంగా 846 మంది, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ విభాగం నుంచి 733 మంది, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ విభాగం నుంచి 365 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సు చేసిన 145 మంది, అడ్వాన్స్‌‌డ్ సీఎన్‌‌సీ మెషీనింగ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన 103 మందితో పాటు వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ కోర్సు చేసిన 73 మంది అభ్యర్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.