గ్రంథాలయాల్లో మూడున్నర దశాబ్దాలుగా నో రిక్రూట్ మెంట్.. ఏజ్ లిమిట్ దాటిపోతుందని క్యాండిడేట్ల ఆందోళన

గ్రంథాలయాల్లో మూడున్నర దశాబ్దాలుగా నో రిక్రూట్ మెంట్.. ఏజ్ లిమిట్ దాటిపోతుందని క్యాండిడేట్ల ఆందోళన

గ్రంథాలయాల్లో పోస్టుల కోసం
ఏండ్లుగా ఎదురుచూపులే..
మూడున్నర దశాబ్దాలుగా నో రిక్రూట్ మెంట్
రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ 
నియామకాలు లేక ఏజ్ లిమిట్ దాటిపోతుందని ఆందోళన
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలంటున్న నిరుద్యోగులు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం లైబ్రేరియన్ పోస్టుల రిక్రూట్ మెంట్ ఎప్పుడు చేపడుతుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాలే తప్ప ఆ తర్వాత వాటి ఊసే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‎ఎస్ సర్కార్ ఉద్యోగాల భర్తీని ఎలాగూ పట్టించుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి లైబ్రేరియన్ పోస్టులు నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. 

లైబ్రరీ సైన్స్ అభ్యర్థులు 2 లక్షల మంది..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 వేల మందికి పైగా సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ వంటి కోర్సులు పూర్తి చేస్తున్నారు. లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వం లైబ్రేరియన్ పోస్టుల భర్తీ చేయకపోవడం, మరోవైపు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి దొరకకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

35 ఏండ్ల కింద అప్పటి టీడీపీ సర్కార్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇటు సివిల్ లైబ్రరీల్లో గానీ, అటు గ్రంథాలయ పరిషత్ లలో గానీ ఎలాంటి రిక్రూట్ మెంట్లు చేపట్టిన దాఖలాలు లేవు. లైబ్రేరియన్ కావాలన్న ఆశతో సంబంధిత కోర్సులు చదివితే.. నోటిఫికేషన్స్ లేకపోవడంతో ఏజ్ లిమిట్ దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూసివేత దశలో లైబ్రరీలు

రాష్ట్రవ్యాప్తంగా సివిల్ లైబ్రరీలు, గ్రంథాలయ పరిషత్ లలో లైబ్రేరియన్ గ్రేడ్ -1, 2, 3, బుక్ బైండర్, బుక్ స్టోర్ కీపర్ తో పాటు వాటి అనుబంధ సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని లైబ్రరీల భవనాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్నింటికి అసలు నిధులు లేకపోవడంతో మూతపడే స్థితిలోకి చేరాయి. అక్కడక్కడా నడుస్తున్న కొన్ని లైబ్రరీలు కూడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, బుక్స్, స్వీపర్ సమస్యలతో సతమతం అవుతున్నాయి. కరెంట్ బిల్లు, న్యూస్ పేపర్స్ బిల్లు కట్టలేని దుస్థితికి చేరుకున్నాయి. 

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి లైబ్రరీ సెస్ పేరుతో వసూలు చేస్తున్న 8 శాతం నిధులు ఎటు పోతున్నాయో తెలియడం లేదని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోకల్ బాడీస్ నుంచి వసూలు చేసిన సెస్ ను లైబ్రరీలకు కేటాయించడంతో పాటు మరిన్ని నిధులు మంజూరు చేసి లైబ్రరీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

మంత్రి పొన్నం హామీ నెరవేరేనా..?

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి లైబ్రేరియన్ పోస్టుల నియామకం చేపడుతామని 2024 ఆగస్ట్ 12న హైదరాబాద్ లోని స్టేట్  సెంట్రల్ లైబ్రరీ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ స్పందించి లైబ్రేరియన్ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగుల కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల మంచిర్యాల కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.