హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్‌ను ‘ఆదిధ్వని’ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిత్యానందరావు తీవ్రంగా ఖండించారు. మాజీ ఉద్యోగి తిరుమలరావు చేస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టతనిచ్చారు. ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు.
ప్రస్తుతం నాంపల్లి క్యాంపస్‌లో దూరవిద్యా కేంద్రం, ఎన్టీఆర్ ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, జ్యోతిష్య తరగతులు సహా 12 కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయని వీసీ వివరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలు వేర్వేరు చోట్ల ఉండడం సహజమేనన్నారు. వాస్తవాలు తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే ఇలాంటి ఆరోపణలను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు
