"సొంత కారు లేదు, ఫ్లాట్ లేదు.. కానీ మనసు నిండా ప్రేముంది ! వధువు కోసం నడిరోడ్డుపై యువకుడి పెళ్లి ప్రకటన...

"సొంత కారు లేదు, ఫ్లాట్ లేదు.. కానీ మనసు నిండా ప్రేముంది ! వధువు కోసం నడిరోడ్డుపై యువకుడి పెళ్లి ప్రకటన...

ఈ రోజుల్లో పెళ్లి చూపులు, మ్యాట్రిమోనీ సైట్లు, బ్రోకర్ల చుట్టూ తిరగడం కామన్. కానీ, పూణేకు చెందిన ఒక యువకుడు మాత్రం తన లైఫ్ పార్ట్‌నర్‌ను వెతుక్కోవడానికి ఎవరూ ఊహించని ఒక క్రేజీ ప్లాన్ వేసాడు. తన వివరాలన్ని ఏకంగా ఒక పెద్ద బిల్‌బోర్డ్ (ఫ్లెక్సీ) పై  నడిరోడ్డుపై అందరికీ కనిపించేలా పెట్టేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దామా....

రోడ్డు పై 'పెళ్లి ప్రకటన' పోస్టర్
పూణేలోని పింపల్ సౌదాగర్ ప్రాంతంలో ఉన్న బిజీ కేట్ పాటిల్ చౌక్ మీదుగా వెళ్తున్న జనాలు ఒక్క నిమిషం ఆగి, అక్కడ ఉన్న ఒక పెద్ద  హోర్డింగ్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే, అది ఏ సినిమా పోస్టరో లేక పొలిటికల్ లీడర్ బర్త్‌డే బ్యానరో కాదు.. ఒక పెళ్లి సంబంధం ప్రకటన. రాఘవ్ విశ్వస్రావ్ షిండే అనే 30 ఏళ్ల యువకుడు తనకు కాబోయే భార్య కోసం ఇలా వెరైటీగా ఒక బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశాడు.

కారు లేదు.. ఇల్లు లేదు..  
సాధారణంగా మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్‌లో వాళ్ళ గురించి గొప్పలు రాసుకోవడం చూస్తుంటాం. కానీ, రాఘవ్ మాత్రం తనకున్నది ఎంతో నిజాయితీగా బ్యానర్‌పై చెప్పాడు.

"నా వయసు 30 ఏళ్లు. నా నెల జీతం రూ.25,000. నాకు సొంతంగా కారూ లేదు, ఫ్లాట్ లేదు, కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు"... అంటూ  ఇలా తన ఆర్థిక పరిస్థితిని దాచకుండా స్పష్టంగా చెబుతూ.. "మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి" అంటూ ఆ బ్యానర్ చివర్లో ఒక రిక్వెస్ట్ పెట్టాడు.

సోషల్ మీడియాలో ఫన్నీ  కామెంట్లు
ఈ వెరైటీ  ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు.     

 "అంతా బానే ఉంది బాస్.. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నిన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఫోన్ నంబర్ వేయడం మర్చిపోయావు" అని ఒకరు సరదాగా కామెంట్ చేశారు.

 "ఆయన నెల జీతం రూ . 25,000 అంటున్నాడు.. కానీ ఆ పెద్ద హోర్డింగ్ పెట్టడానికే అతని నెల జీతంలో సగానికి పైగా ఖర్చయి ఉంటుంది" అంటూ మరొకరు అన్నారు.

 చాలా మంది పెళ్లికాని వాళ్ళ స్నేహితులను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తూ, "నీకు కూడా ఇలాంటి బ్యానర్ ఒకటి డిజైన్ చేయించమంటావా?" అంటూ జోక్ చేస్తున్నారు.

ఇదంతా నిజమేనా.. లేక పబ్లిసిటీ స్టంటా?
ఈ బ్యానర్ చూసిన కొందరు.. ఇది నిజంగానే పెళ్లి కోసం చేసిన ప్రయత్నమా లేక ఏదైనా కొత్త సినిమా, వెబ్ సిరీస్ ప్రమోషనా? అని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా, ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదరడం ఎంత కష్టంగా మారిందో చెప్పడానికి, అలాగే ఒక సగటు మధ్యతరగతి యువకుడు తన జీవిత భాగస్వామి కోసం పడుతున్న ఆరాటాన్ని ఎంతో నిజాయితీగా చూపించడానికి ఈ బ్యానర్ ఒక నిదర్శనంగా నిలిచింది.

ప్రస్తుతానికైతే ఈ పూణే కుర్రాడి నిజాయితీ, ధైర్యం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటున్నాయి.