ఇదే ప్యూర్ ఫిల్మ్‌మేకింగ్: మీ లైఫ్లో 3 గంటలు కేటాయించండి.. ‘మహేష్ బాబు’ సినిమాకు ఊపిరి పోసిన సందీప్ రెడ్డి వంగా

ఇదే ప్యూర్ ఫిల్మ్‌మేకింగ్: మీ లైఫ్లో 3 గంటలు కేటాయించండి.. ‘మహేష్ బాబు’ సినిమాకు ఊపిరి పోసిన సందీప్ రెడ్డి వంగా

‘సినిమా’ (CINEMA) అంటే వినోదంతో పాటు విజ్ఞానం కూడా. కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని ఉత్తేజపరుస్తాయి. అలాంటి సినిమాలను ఆడియన్స్ ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా థియేటర్లో ఉన్నప్పుడే చూసేయాలి. ఇపుడు అలాంటి ఓ సినిమానే ఇండియన్ టాప్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని ఆలోచింపజేసేలా చేసింది. సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ సినిమా కోసం మీ జీవితంలో మూడు గంటల సమయం కేటాయించండి. ఇది మనకు సినిమాపై ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేసే అరుదైన చిత్రం’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతగా సందీప్ రెడ్డి వంగాను మెప్పించిన ఆ సినిమా ఏది? అది ఏ జానర్‌లో తెరకెక్కింది? ఎందుకు అంత ప్రత్యేకంగా నిలిచింది? ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన C/o కంచరపాలెం (2018) మరియు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020) వంటి సినిమాలను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే లాంగ్ గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘రావు బహదూర్’ (Rao Bahadur). టాలీవుడ్ వర్సటైల్ యాకర్ట్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా జులై 3, 2026న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సమర్పించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 

మీ లైఫ్లో 3 గంటలు కేటాయించండి..

లేటెస్ట్గా ‘రావు బహదూర్’ సినిమాపై యానిమల్ & స్పిరిట్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసలు కురిపించారు. ఇవాళ (జులై 14న) వంగా X వేదికగా ట్వీట్ చేస్తూ..‘ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మూడు గంటల సమయం కేటాయించాలి. ఇది మనకు సినిమాపై ఉన్న ప్రేమను గుర్తు చేసే అరుదైన చిత్రం’ అని పేర్కొన్నారు. పరిమిత బడ్జెట్‌లో ఎలాంటి రాజీ పడకుండా తెరకెక్కించిన వెంకటేష్ మహా పనితీరును కూడా సందీప్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 

‘‘ఇప్పుడే ‘రావు బహదూర్’ చూశాను. సినిమాను మనం మొదటిసారి ఎందుకు అంతగా ప్రేమించామో మరోసారి గుర్తు చేసే అరుదైన, విలువైన చిత్రాల్లో ‘రావు బహదూర్’ ఒకటి. ప్రతి నిజమైన సినీ ప్రేమికుడికి నా ఒక్క విజ్ఞప్తి.. మీ జీవితంలో మూడు గంటల సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించండి. ఈ చిత్రం మీ శ్రద్ధకు, ఓర్పుకు, చప్పట్లకు పూర్తిగా అర్హమైనది. పరిమిత బడ్జెట్‌లోనే ఎలాంటి రాజీ పడకుండా, అపారమైన ధైర్యం, పూర్తి నమ్మకంతో వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

సత్యదేవ్ నటన అసాధారణంగా ఉంది. హంగామా లేదు.. షార్ట్‌కట్స్ లేవు.. స్వచ్ఛమైన ఫిల్మ్‌మేకింగ్ మాత్రమే. ఈ అద్భుతమైన చిత్రాన్ని అందించిన మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సినిమాలు తప్పకుండా సెలబ్రేట్ చేయాల్సిందే’’ అని వంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మనసులోకి చొచ్చుకుపోయే అనుభూతి: మహేష్ బాబు 

రావు బహదూర్’ చిత్రానికి దర్శకుడు సుకుమార్, సమర్పకుడు మహేష్ బాబు ప్రశంసలు దక్కాయి. సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు స్పందిస్తూ.. "ఇది కేవలం చూసే సినిమా కాదు.. మనసులోకి చొచ్చుకుపోయే అనుభూతి. విచిత్రమైనది, అందమైనది, తీవ్రమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం" అని కొనియాడారు. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన విధానం, సత్యదేవ్ నటన, దీపా థామస్ అభినయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

‘రావు బహదూర్’ బాక్సాఫీస్‌.. ప్రాణం పోసిన వంగా!

 ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అయితే భారత్‌లో రూ.7 కోట్లకి పైగా నెట్, రూ.8 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బ్రేక్‌ఈవెన్ లక్ష్యానికి ఇంకా దాదాపు రూ.12 కోట్ల గ్రాస్ దూరంలో ఉన్న ‘రావు బహదూర్’ సెకండ్ వీకెండ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఇప్పుడు వంగా చేసిన ట్వీట్ తో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

‘రావు బహదూర్’ కథ:

కుల వ్యవస్థ, రంగు, రక్తసంబంధాలు, సామాజిక మూఢనమ్మకాల వంటి సున్నితమైన అంశాల నేపథ్యంలో సెటైరికల్, ఫిలాసఫికల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. 1968 నుంచి 1991 మధ్యకాలంలో సాగే ఈ కథలో, రామప్ప (సత్యదేవ్) అనే 60 ఏళ్ల వృద్ధుడు ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. శారీరక రుగ్మతతో బాధపడుతూ, జీవిత చరమాంకంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బతుకుతుంటాడు.

అయితే రామప్ప తన చివరి వరకు ఏ లక్ష్యం కోసం పోరాడాడు? అతని జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏమిటి? రేణుక (దీపా థామస్)తో అతని ప్రేమకథ ఎలా ప్రారంభమైంది? ఆమె లేకుండా రామప్ప ఎందుకు ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది? యవ్వనంలో ఎదురైన అనుభవాలు, ప్రేమ, కుటుంబ బంధాలు అతని జీవితాన్ని ఎలా మలిచాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘రావు బహదూర్’ సినిమా కథ.

దర్శకుడు వేంకటేష్ మహా, మరోసారి తనదైన శైలిలో ఎమోషన్స్, సామాజిక అంశాలు, తాత్విక ప్రశ్నలను సందించాడు. ముఖ్యంగా కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, రక్తసంబంధాలు వంటి సున్నితమైన అంశాలను కథలో భాగంగా చూపించి  ప్రేక్షకుడిని ఆలోచింపజేసాడు. ఈ సినిమాకు సత్యదేవ్ నటన ప్రధాన బలంగా నిలిచింది. 60 ఏళ్ల వృద్ధుడు రామప్ప పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, భావోద్వేగాలు, అంతర్మథనాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు వెంకటేష్ మహా..