హాలీవుడ్ చరిత్రలో ఒక బయోపిక్ పాత రికార్డులను తిరగరాసింది. పాప్ సంగీత ప్రపంచాన్ని ఏలిన 'కింగ్ ఆఫ్ పాప్' మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైకేల్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం ఏకంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి బయోపిక్‌గా రికార్డు సృష్టించింది.
దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా రూపొందించిన ఈ చిత్రం, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా నిలిచింది. గతంలో 'బోహీమియన్ రాప్సడీ' (911 మిలియన్ డాలర్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఒపెన్‌హైమర్' (975 మిలియన్ డాలర్లు) కలెక్షన్లను కూడా అధిగమించింది. దీంతో నిజ జీవిత వ్యక్తి ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'మైకేల్' చరిత్రలో నిలిచింది.
2026 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం ఉత్తర అమెరికాలో సుమారు 372 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 629 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో కలెక్షన్లు రోజురోజుకూ పెరిగాయి.
►ALSO READ | 'లెనిన్' మూవీపై చిరంజీవి ట్వీట్‌కు అఖిల్ ఎమోషనల్ రిప్లై.. 'పెదనాన్న' అంటూ పోస్ట్ !
ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. ఇదే అతని తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం మరో ప్రత్యేకత. జాన్ లోగన్ కథను అందించగా, కోల్మన్ డొమింగో, నియా లాంగ్, మైల్స్ టెల్లర్, లారా హారియర్, మైక్ మైయర్స్ కీలక పాత్రల్లో నటించారు. జాక్సన్ ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని, 1988 'బ్యాడ్ వరల్డ్ టూర్' వరకు ఈ సినిమా చూపిస్తుంది. విడుదలకు ముందు వివాదాలు, స్క్రిప్ట్ మార్పులు ఎదురైనా చివరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
