మనవరాలితో కారు డ్రైవింగ్..ఎస్ఐ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు

మనవరాలితో కారు డ్రైవింగ్..ఎస్ఐ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు
  • బాలికకు 25 ఏండ్లు వచ్చేవరకు 
  • డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయొద్దని రవాణాశాఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రవాణాశాఖ నిబంధనలను ఉల్లంఘించి, మైనర్ అయిన తన మనవరాలికి కారు ఇచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌ఐ తిరుపతిపై రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఐ వాహన రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను ఏడాదిపాటు రద్దు చేశారు. అంతేకాకుండా, ఆ బాలిక మేజర్ అయిన తర్వాత కూడా ఏడేండ్లపాటు.. అంటే ఆమెకు 25 ఏండ్ల వయస్సు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వీలు లేదని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ మేరకు సోమవారం ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టరీత్యా నేరమని, అలా ఇచ్చినందుకు వాహన యజమాని శిక్షకు అర్హుడని అధికారులు హెచ్చరించారు. ఆదివారం నార్సింగి పరిధిలో బాలిక చేత కారు డ్రైవింగ్ చేయించి, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌కు కారణమైన ఎస్ఐ పూజారి తిరుపతి తీరు సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు.

మరోవైపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం తీవ్రమైన నేరమని, ఇటు మైనర్లతోపాటు అటు వాహన యజమానులపై రవాణాశాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వాహనాల తాళాలు పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు.