వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని సందర్భంగా వేములవాడ బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల స్కూల్లో సోమవారం విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందులో భాగంగానే ప్రతి ఏటా రెండుసార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కూడా అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు.
