గంగాధర, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉండటమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా, ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని విడుదల చేయబోమని సీఎం ప్రకటించారని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయనకుటుంబసభ్యులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.
సాగునీరు ఇవ్వాలని కోరే రైతులు కన్నెపల్లి వద్ద బండ కట్టుకొని దూకాలంటూ వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని, శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ అంశంపై సంబంధిత చట్టాల ప్రకారం సీఎంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గంగాధర పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.
