హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ బకాయిల విడుదలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను అసలు పట్టించుకోవడమే లేదని విమర్శించారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఫీజులు అందక విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ జరపాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని జీవన్ కోరారు.
