ఎప్పటికైనా రాజమౌళి సినిమాలో నటించాలనేది నా కోరిక: భాగ్యశ్రీ బోర్సే 

ఎప్పటికైనా రాజమౌళి సినిమాలో నటించాలనేది నా కోరిక: భాగ్యశ్రీ బోర్సే 

తెలుగు చిత్రపరిశ్రమ, హైదరాబాద్ తనకెంతో ప్రత్యేకమని,  ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పింది భాగ్యశ్రీ బోర్సే.  అఖిల్‌‌కు జంటగా ఆమె నటించిన ‘లెనిన్‌‌’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో తను పోషించిన భారతి పాత్రకు లభిస్తున్న రెస్పాన్స్‌‌ గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల రెస్పాన్స్‌‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందులో నా నటన గురించి ఎన్నో మెసేజ్‌‌లు వచ్చాయి. ఈ సక్సెస్‌‌ నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.  

ఈ సినిమా కంటెంట్‌‌ను టీమ్‌‌ అంతా బలంగా నమ్మాం. ఆ నమ్మకం నిజమవడంతో ఈ సక్సెస్‌‌ విషయంలో కొంత ఎమోషనల్‌‌ అయ్యాను.  భారతి లాంటి మంచి పాత్ర రావడం నా అదృష్టం.  దర్శకుడు కథ చెప్పినప్పుడే ఇందులో నటనకు మంచి అవకాశం ఉందని అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది.  నాగార్జున గారు వేదికపై నా నటన గురించి మాట్లాడటం, చాలా రివ్యూల్లో నా నటనను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ఈ ప్రశంసలు నటిగా నా  బాధ్యతను పెంచాయి. తెలుగు సినిమా నటిగా నాకు అవకాశం ఇచ్చింది.  నా సినిమా కెరీర్‌‌‌‌ హైదరాబాద్‌‌ నుంచే మొదలైంది.  ఇక్కడి ప్రేక్షకులు నన్నెంతో ప్రేమగా ఆదరించారు. తెలుగమ్మాయిలా చూసుకుంటున్నారు. అందుకే టాలీవుడ్‌‌,  హైదరాబాద్‌‌ నాకెంతో ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నా. 

ఇక నటిగా మహారాణి, యువరాణి పాత్రలు పోషించాలని ఉంది. అలాంటి చిత్రాల్లో రాజమౌళి గారు మాస్టర్. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరిక. అలాగే ఇటీవల ‘మా ఇంటి బంగారం’లో సమంత గారి నటన చూశాక వావ్ అనిపించింది. అలాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌‌తో 'సీయోన్' సినిమా చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్‌‌లు ఉన్నాయి. త్వరలో రివీల్ చేస్తాం” అని చెప్పింది.