- ఎమ్మెల్సీ బల్మూరి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఫొటో ఎగ్జిబిషన్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతి దాహా నికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ దానికి సంబంధించిన పలు ఫొటోలతో సోమవారం గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన పిల్లర్లు , నీట మునిగిన పంపులు తదితర ఫొటోలను ఇందులో ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆయన అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్.. దొంగలా ఫామ్ హౌస్ లో ఆ డబ్బును దాచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేయడం కాదు.. ముందుగా కేటీఆర్ రక్తదానం చేసి, వాటి శాంపిల్స్ ను ఇస్తే డ్రగ్స్ టెస్టు చేయిస్తా’ అని అన్నారు. అప్పుడు కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉందో లేదో తెలుస్తుందని అన్నారు. పదేండ్ల పాటు తెలంగాణ ప్రజల రక్తాన్ని రాబందుల్లా పీల్చుకుతాగి, ఇప్పుడు రక్తదానం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
