- రేపు ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలకు గడువు...
హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ–2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు, అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా అధికారిక పోర్టల్‌లో (https://neet.nta.nic.in/ ) చూసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ చేసిన ఈ-మెయిల్‌కు కూడా స్కాన్ కాపీలు పంపినట్లు ఎన్‌టీఏ తెలిపింది.
ఓఎంఆర్ షీట్‌లో ఏవైనా తప్పులు కనిపిస్తే ఈనెల15వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు చెప్పొచ్చని అధికారులు తెలిపారు. ప్రతి ప్రశ్నకు రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. స్కానింగ్‌లో తప్పు జరిగిందని అభ్యర్థి చెప్పింది నిజమైతే ఆ ఫీజును తిరిగి ఇస్తామని వెల్లడించారు. ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లు నింపినా, సగం మాత్రమే నింపినా ఆ సమాధానం చెల్లదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
అలాంటి వాటికి నెగెటివ్ మార్కులు కూడా పడతాయని తెలిపింది. బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో చేసిన మార్కింగ్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఓఎంఆర్ షీట్లలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నుంచి డీబార్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఎన్‌టీఏ హెచ్చరించింది. సందేహాలు ఉంటే 011–-407–59000 లేదా neetug2026@nta.ac.in ద్వారా సంప్రదించాలని సూచించింది.
