హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ లులు మాల్ పార్కింగ్ స్థలంలో గన్ ప్రత్యక్షం కావడం స్థానికంగా కలవరానికి గురిచేసింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...లులు మాల్ పార్కింగ్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయిస్తున్న క్రమంలో.. పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్ ఉండటాన్ని గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కేపీహెచ్‌బీ సీఐ రాజశేఖర్ రెడ్డి తక్షణమే స్పందించి ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జరిపిన ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తికి ఆ గన్ పట్ల చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఇంత పెద్ద మాల్ లోనికి వచ్చే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది సరిగా తనిఖీలు చేయకపోవడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాల కారణంగా లులు మాల్ యాజమాన్యంపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
