- కేంద్రంతో కొట్లాడి ఎంపీ వంశీకృష్ణ తాడిచర్ల2 మైన్ సాధించిండు
- బీఆర్ఎస్ పీఠం కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్లాట
- కమీషన్ల కోసం కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు
- బీఆర్‌ఎస్ పార్టీకి రూ.1,400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న
- మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొట్లాడి సింగరేణికి తాడిచర్ల2 బొగ్గు బ్లాక్‌ను సాధించారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మైన్‌తో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, దండెపల్లి మండలాల్లో మంత్రి వివేక్ పర్యటించారు. మందమర్రిలోని బీ1 ఆఫీస్‌లో బీఎల్‌ఏలతో సమీక్ష సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.
సింగరేణి సంస్థ బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్) పరిధిలోకి వెళ్లినప్పుడు తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎన్టీపీసీతో రుణం ఇప్పించి సంస్థను కాపాడడంతో పాటు లక్ష మంది కార్మికుల ఉద్యోగులను రక్షించారని గుర్తుచేశారు. సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్‌లు కేటాయించాలని కేంద్రంపై ఎంపీ వంశీకృష్ణ ఒత్తిడి తెచ్చారని, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ప్రధాని మోదీని తరుచూ కలిసి వినతిపత్రాలు అందించారన్నారు.
తాను ఎమ్మెల్యే అయ్యాక సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి కొత్త బొగ్గు బ్లాక్‌లు దక్కించుకోవడానికి కేంద్రం నిర్వహించే వేలంలో సింగరేణి పాల్గొనేలా పర్మిషన్ ఇప్పించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా గత బీఆర్‌ఎస్ సర్కార్ అడ్డుకుందన్నారు. బొగ్గు బ్లాక్‌లను కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా... కేసీఆర్తీసుకోవడానికి ఆసక్తిచూపలేదని ఆరోపించారు.
తాడిచర్ల1 బొగ్గు గనిని కేంద్రం సింగరేణికి కేటాయిస్తే అప్పటి సీఎండీతో కుమ్మక్కై, అందులో నాణ్యమైన బొగ్గు లేదంటూ కేసీఆర్లెటర్ పెట్టించి గనిని తీసుకోలేదని మండిపడ్డారు. అదే గనిని జెన్‌కోకు ఇప్పించి తనకు అనుకూలమైన ఏఎంఆర్ కంపెనీకి అప్పగించి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల ఉద్యోగ భద్రత, ఉపాధి కోసం కొత్త బొగ్గు గనులను సింగరేణికి తీసుకువచ్చేందుకు కాకా కుటుంబం రాజీలేని పోరాటాలు చేస్తుందని చెప్పారు.
బీజేపీ వ్యాఖ్యలు విడ్డూరం..
తాడిచర్ల 2 మైన్ కేటాయింపు విషయంలో బీజేపీ లీడర్లు మేమే గనిని తీసుకువచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వివేక్ విమర్శించారు. పన్నెండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు సింగరేణికి ఒక్క బొగ్గు గనిని తీసుకురాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి పాలకులు సింగరేణికి సంబంధించిన డీఎంఎఫ్‌టీ, సీఎస్ఆర్నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు.
సింగరేణి నిధులు తరలిపోతుంటే అప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ కనీసం అడ్డుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది పనులు చేస్తుంటే తన నిధులంటూ సుమన్ చెప్పుకుంటున్నాడని, గతంలో నిధులుంటే ఎందుకు అభివృద్ది చేయలేదని మంత్రి ప్రశ్నించారు.
మనుమడి కోసం ఫామ్‌హౌస్ వీడారు.. ప్రజల కోసం అసెంబ్లీకి రారు: మంత్రి వివేక్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘మనుమని బర్త్‌డే ఉంటే కేసీఆర్ ఫాం హౌస్ వీడి బయటకు వచ్చిండు. అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కోరినా రాలేదు. ప్రజా సమస్యలపై నోరు విప్పలేదు’అని మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. సోమవారం సిరిసిల్లలో దళిత నాయకుడు రాగుల రాములు కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పదేండ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం కమీషన్లు దండుకొని, ఆస్తులు పెంచుకుందన్నారు
. కాళేశ్వరం నీళ్లు వృథా అవుతున్నాయంటూ హరీశ్ రావు, కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాటర్ పంపింగ్ చేయొద్దని చెబుతోందని, ఈ పరిస్థితిలో నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏ పర్మిషన్ తీసుకురావాలన్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న నిజమేనని, ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాలో మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. మరోవైపు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సిరిసిల్ల టాప్‌లో ఉందని వివేక్ చెప్పారు. మంత్రి వెంట డీసీసీ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మార్కెట్ చైర్ పర్సన్ స్వరూప ఉన్నారు.
బీఆర్ఎస్లో ఆధిపత్యం కోసం బావబామ్మర్దుల కొట్లాట..
కేసీఆర్ 77 వేల పుస్తకాలు చదివి తానే ఇంజనీర్‌ను అంటూ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగిపోయిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టును కట్టి ప్రజల సొమ్మును దండుకున్నారని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావు మధ్య బీఆర్‌ఎస్ పార్టీలో అధిపత్యం కోసం పోరు నడుస్తోందన్నారు.ఉద్యమపార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు రూ.1,400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కేసీఆర్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని గుర్తుచేశారు
. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేదని, అందుకే పిల్లర్లు కుంగిపోయాయని, ఇప్పుడు ఏం చేయవద్దని సెంట్రల్ కమిటీ ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. తాను మంత్రి అయ్యాక కాంట్రాక్ట్ కార్మికుల మినిమం వేజెస్ పెంచుతూ జీవో తీసుకువచ్చామని చెప్పారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు కూడా పెంచేందుకు కృషి చేస్తానని, ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
