హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తూ ఇంకా టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ టెట్’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 21న స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు.
టీచర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండుసార్లు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తొలి స్పెషల్ టెట్‌కు రంగం సిద్ధం చేశారు. గవర్నమెంట్, లోకల్ బాడీ, మోడల్ స్కూల్స్, సొసైటీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లందరికీ ఈ పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు పొందాలన్నా.. సర్వీసులో కొనసాగాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ ప్రత్యేక పరీక్ష వారికి పెద్ద ఊరటనివ్వనుంది.
