గద్వాల, వెలుగు: 'గత సర్కార్ చేసిన అప్పులకు వడ్డీ కట్టుడే సరిపోతుంది, అప్పులు ఎందుకు చేశారని అడగాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటి బయటకు రావడం లేదు.. బావబామ్మర్దులు కేటీఆర్, హరీశ్ రావుది చెరో రూట్.. వాళ్లను అడుగుదామంటే చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నరు' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. గద్వాల జిల్లా ధరూర్ లో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో కోమటిరెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, దళితుడిని సీఎం చేస్తానని మాటిచ్చి మోసం చేశారన్నారు. ధరూర్ మండలంలోని జూరాల, ధరూర్ వరకు ఉన్న రోడ్డును ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్ అండ్ బీ శాఖకు మార్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రైవేట్ చదువులు, హాస్పిటల్ ఖర్చుల కారణంగానే చాలా మంది అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు. ఖర్చు పెట్టే ముందు ఆలోచించాలని, పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయుడు, శంకర్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు.
రవాణా వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి
రవాణ వ్యవస్థ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని, వ్యాపారాలు పెరుగి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మక్తల్ నియోజక వర్గంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి వాకిటి శ్రీహరి స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి మక్తల్ -నారాయణపేట హ్యామ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్లు రాధా, సదాశివా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ విజయ్ కుమార్, ఆర్ అండ్ బీ సీఈ వెంకటేశ్వర్ రావు, ఎస్ ఈ రాజేందర్ పాల్గొన్నారు.
