హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ నెల 18న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించనున్నారు. జులై నెలకు సంబంధించి ‘పేరెంట్స్ ప్రామిస్’ అనే ప్రత్యేక థీమ్‌తో ఈ మీటింగ్స్ జరగనున్నాయి. సమావేశంలో భాగంగా పిల్లల చదువు, హాజరు, క్రమశిక్షణకు సంబంధించి రూపొందించిన ఆరు వాగ్దానాల్లో కనీసం ఒక దానిని ఎంచుకుని తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది.
అలాగే విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలను, ప్రతిభను తల్లిదండ్రుల ముందు ప్రదర్శిస్తారు. అనంతరం టీచర్లు తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడి పిల్లల మార్కులు, ప్రవర్తనపై చర్చిస్తారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులకు 16లోపు ఆహ్వాన పత్రాలు పంపాలని, మీటింగ్ వివరాలను ‘స్కూల్ ఎడ్యుకేషన్ యాప్’లో అప్‌లోడ్ చేయాలని హెచ్‌ఎంలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.
