వట్టెం రిజర్వాయర్ కట్ట క్వాలిటీపై సీఐడీ ఎంక్వైరీ

వట్టెం రిజర్వాయర్ కట్ట క్వాలిటీపై సీఐడీ ఎంక్వైరీ

నాగర్​కర్నూల్, వెలుగు: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని వెంకటాద్రి రిజర్వాయర్​(వట్టెం) కట్ట నాణ్యతపై సోమవారం సీఐడీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. వట్టె రిజర్వాయర్ లో 16.74 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 14.5 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మించారు. ఈ కట్ట నాణ్యతపై ఆరోపణలు రావడంతో విచారణ జరపాలని కారుకొండ గ్రామానికి చెందిన రైతులు 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

కట్ట నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో భూ సేకరణ చేయకుండా నాలుగు చోట్ల వదిలేశారని, తర్వాత ఆ ప్రాంతంలో ప్యాచ్‎లు వేశారని పిటిషన్‎లో పేర్కొన్నారు. రిజర్వాయర్​లోపలి భాగంలో 500 మీటర్ల దూరం నుంచి మట్టి, రాళ్లు తీయాల్సి ఉన్నా కేవలం 50 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్​చేసి తీసిన రాళ్లు, మొరం కట్టకు వినియోగించారని కోర్టు దృష్టికి తెచ్చారు.

 కట్ట నాణ్యతను పరిశీలించి అవసరమైన చోట పటిష్టంగా నిర్మించాలని, గ్రామానికి ఆర్​అండ్​ఆర్​ప్రకటించి కట్ట దిగువ భాగం నుంచి తరలించాలని కోరారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఐడీ ఆఫీసర్లు సోమవారం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామస్తుల అనుమానాలు, అభ్యంతరాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సీఐడీ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్​తెలిపారు.