అర్హత నిబంధనల వల్లే  ఉద్యోగాలు కోల్పోవడం బాధగానే ఉంది: సుప్రీం కోర్టు

అర్హత నిబంధనల వల్లే  ఉద్యోగాలు కోల్పోవడం బాధగానే ఉంది: సుప్రీం కోర్టు
  •     అయినా నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: అభ్యర్థులు రాతపరీక్షలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ.. అర్హత నిబంధనల వల్లే ఉద్యోగాలు కోల్పోతుండటం చూస్తుంటే తమకూ బాధగానే ఉందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన పలు నియామకాలపై దాఖలైన పిటిషన్‌‌ విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వారిపై న్యాయస్థానాలకు పూర్తి సానుభూతి ఉందని, అలాగని నిబంధనలను పక్కనపెట్టి నిపుణుల కమిటీల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ చేపట్టిన మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎంపీఎస్‌‌ఓ/ ఏఎస్‌‌ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్(కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది.

టీజీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, తమకు అర్హతలున్నా ఉద్యోగం ఇవ్వడంలేదని వై జగదీశ్ సహా మరికొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఈ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (నెంబర్ 12/2018) జారీ చేసింది. అభ్యర్థులు తమ డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టును ఒక పేపర్‌‌గా ఒక ఏడాది చదివి ఉండాలనే నిబంధన పెట్టింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులూ ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. వారు తమ నాలుగేళ్ల కోర్సులో కేవలం ఒకే ఒక్క సెమిస్టర్ ‘ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్’ సబ్జెక్టును చదివినట్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కమిషన్ గుర్తించింది. ఒక సెమిస్టర్ చదవడం అనేది ఒక పూర్తి విద్యా సంవత్సరానికి సమానం కాదంటూ, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కమిషన్ వారికి 2019లో రిజెక్షన్ మెమోలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఇదివరకే హైకోర్టు టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును జగదీశ్ సహా 13మంది  2026 మే 8న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.