తొలి సినిమాకే తన బ్రదర్ రుత్విక్ ఎంతో ఛాలెంజింగ్ పాత్ర చేశాడని చెప్పారు కె. నిహారిక దాసరి. రుత్విక్ హీరోగా అనిల్ బోయిడపు దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ‘రాజా ది రాజా’. జులై 17న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. రుత్విక్‌కు సినిమాలంటే చాలా ప్యాషన్. అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. అలాగే ఓ షార్ట్ ఫిల్మ్‌లో అబ్బాయి, అమ్మాయిగా డ్యూయల్ రోల్ చేశాక తనపై మరింత నమ్మకం పెరిగింది.
మంచి ఛాలెంజింగ్ పాత్రతో హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. ఇది చాలా బలమైన కథ. ఇందులో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం మెథడ్ యాక్టింగ్ చేయడంతో పాటు రిస్కీ యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండా చేశాడు. ప్రేక్షకులు అతని కష్టాన్ని గుర్తిస్తారని నమ్ముతున్నా.
హీరోయిన్ విశాఖ ధిమాన్ నటన చాలా సహజంగా ఉంటుంది. అలాగే సాయికుమార్, నరేష్, అవసరాల శ్రీనివాస్ లాంటి సీనియర్స్ మాకెంతో సపోర్ట్ చేశారు. ఇదొక ఫీల్‌గుడ్ మూవీ. అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా విడుదలవడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని చెప్పారు.
