ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మత్తు ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆదిలాబాద్పట్టణ బస్టాండ్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఆర్ఎంపీ సిందే జగన్నాథ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.
దీంతో అతడిని వెంబడించి పట్టుకొని విచారించగా.. ఆపరేషన్ల సమయంలో వినియోగించాల్సిన మత్తు పదార్థాన్ని గంజాయి వినియోగదారులు, ఇతర వ్యక్తులకు అమ్ముతున్నట్లు తేలింది. ఆర్ ఎంపీ జగన్నాథ్, జగదాంబ ఫార్మసీకి చెందిన రమేశ్ గౌడ్, గెట్ వెల్ మెడికల్స్ కు చెందిన సయ్యద్ కమ్రుద్దీన్ తో పాటు ముషారఫ్, సమీర్, ఇర్ఫాన్ ఖాన్, ముకీద్ లు ఈ దందాలో భాగస్వాములైనట్లు గుర్తించారు.
ముషారఫ్ ఓ కేసులో ఇప్పటికే జైలులో ఉండగా.. సయ్యద్ కమ్రుద్దీన్, జగన్నాథ్ ను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 190 ఇన్సులిన్ సిరంజీలు, 50 మత్తు మందు బాటిళ్లు, రెండు మొబైల్స్, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఐ నాగరాజు, ఎస్సై అఖిల్, ప్రణయ్ కుమార్ ఉన్నారు.
