జైపూర్, వెలుగు : తనను పెండ్లి చేసుకోవాలని ఓ యువకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోషిక బాలేశ్, రాజేశ్వరి దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు. చిన్న కూతురైన మాధవి (26) బీఫార్మసీ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గోనె వెంకటేశ్ తనను పెండ్లి చేసుకోవాలని రెండేండ్లుగా మాధవిని వేధిస్తున్నాడు.
వెంకటేశ్‌కు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ సైతం అండగా నిలిచారు. ఇరు కుటుంబాల కులాలు వేరుకావడంతో మాధవి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇదే విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా వెంకటేశ్ వినకుండా మాధవి వెంట పడుతూనే ఉన్నాడు. పెండ్లికి ఒప్పుకోకపోతే తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు.
వేధింపులు తట్టుకోలేక మాధవి.. తన ఆత్మహత్యకు వెంకటేశ్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆదివారం రాత్రి ఉరి వేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాధవి కుటుంబీకులు మంచిర్యాల ఐబీ ప్రాంతంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
