న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్) లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సోమవారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం, కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ. 4,624 కోట్లకు చేరింది. రూ. 4,588 కోట్ల లాభం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు.
గతేడాది జూన్ క్వార్టర్‌లో కంపెనీ లాభం రూ. 3,843 కోట్లుగా ఉంది. హెచ్‌సీఎల్ టెక్ రెవెన్యూ 14 శాతం వృద్ధి చెంది రూ. 34,579 కోట్లకు చేరగా, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 3 శాతం పెరిగింది. జూన్ క్వార్టర్‌లో కంపెనీ ఏకంగా 2.4 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది.
ఇందులో జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌తో కుదుర్చుకున్న 1.14 బిలియన్ డాలర్ల మెగా ఏఐ డీల్ అత్యంత కీలకమైనది. కంపెనీ అడ్వాన్స్‌డ్ ఏఐ విభాగం నుంచి 171 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 62.1 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రతి షేరుకు రూ. 12 మధ్యంతర డివిడెండ్ కంపెనీ బోర్డ్ ప్రకటించింది. దీనికి ఈ నెల 17 ను రికార్డు తేదీగా, జులై 27ను పేమెంట్ తేదీగా నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా, డిమాండ్ పడిపోయినా కంపెనీ తన పూర్తి స్థాయి 2026–27 రెవెన్యూ గైడెన్స్‌ను 1-4 శాతంగానే కొనసాగించింది. దీంతో ఐటీ షేర్లు సోమవారం లాభాల్లో ట్రేడయ్యాయి. తమ ఏఐ స్ట్రాటజీలకు క్లయింట్ల నుంచి మంచి స్పందన వస్తోందని కంపెనీ సీఈఓ సి. విజయకుమార్ తెలిపారు.
