న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్) లో అదరగొట్టింది. సంస్థ రెవెన్యూ రూ.4,418 కోట్లకు చేరిందని టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం వెల్లడించారు. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.4,017 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువని అన్నారు. బీఎస్ఎన్ఎల్ మొదటి క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ తర్వాత ఆయన మీడియాకు ఈ వివరాలు తెలియజేశారు.
బీఎస్ఎన్ఎల్ 'ఎంటర్‌ప్రైజ్ బిజినెస్' విభాగం ఆదాయం 19.2 శాతం వృద్ధితో రూ. 1,745 కోట్లకు చేరగా, మొబైల్ సేవలతో కూడిన 'కన్స్యూమర్ మొబిలిటీ' విభాగం 8 శాతం వృద్ధితో రూ. 1,724 కోట్లను ఆర్జించింది. అయితే, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఉండే 'కన్స్యూమర్ ఫిక్స్‌డ్ యాక్సెస్' (సీఎఫ్‌ఏ) విభాగం ఆదాయం మాత్రం రూ. 960 కోట్ల నుంచి రూ. 948 కోట్లకు స్వల్పంగా తగ్గింది. యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) రూ. 100 నుంచి రూ. 102.7 కి చేరింది.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో ఆదాయం పెరిగింది. ల్యాండ్‌లైన్ కనెక్షన్ల తగ్గుదల సమస్యను రాబోయే కొద్ది నెలల్లో 'భారత్‌నెట్' ఆప్టికల్ ఫైబర్ సేవల ద్వారా అధిగమిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌కు రూ. 28,473 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని ద్వారా అదనంగా మరో 22 వేల 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.
