భూపాలపల్లి జిల్లాలో ఘోరం: భూమి పంచివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

భూపాలపల్లి జిల్లాలో ఘోరం: భూమి పంచివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

మహాముత్తారం, వెలుగు : భూమిని పంచి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్ పల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (65)తనకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 

సారయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రత్నం రవీందర్‎కు గతంలో పెండ్లి కాగా అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రవీందర్ మానసిక స్థితి కోల్పోయి ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తనకు భూమిని పంచి ఇవ్వాలని తండ్రితో గొడవ పడేవాడు. 

భూమి పంచేందుకు తండ్రి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రవీందర్ నిద్రలో ఉన్న తండ్రి సారయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సారయ్య అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య పోచమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొర్ల రమేశ్ తెలిపారు.