- ఓరుగల్లులో పోటాపోటీగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు
- రెండు నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
- ఓటు తొలగింపు భ్రమలు తొలగిస్తూ ముందుకు..
- ఓటర్ల నుంచి అనూహ్య స్పందన
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్కులకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. శిక్షణ పొందిన యువతతో నగరంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా సర్ ప్రక్రియ వేగం పుంజుకుంది. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుండగా, చాలాచోట్ల ఈ నెల 14నే దరఖాస్తుల సమర్పణకు గడువుగా నిర్ణయించారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసినా, చాలామంది ఇప్పటికీ వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశాయి. ఓటర్లు తమకు సమీపంలోని కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు పూరించడంతో ప్రక్రియ వేగవంతమవుతోంది.
హెల్ప్ డెస్కులతో వేగం..
ఎన్యూమరేషన్ ప్రక్రియ మందగించడం, నిజమైన ఓట్లు తొలగిపోయే అవకాశాలపై ఆందోళనల నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు హెల్ప్‌డెస్కుల ఏర్పాటుకు చొరవ చూపారు. డివిజన్లు, గ్రామాల వారీగా యువతను ఎంపిక చేసి అధికారులతో శిక్షణ ఇప్పించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్, పాత ఓటరు జాబితాలు అందుబాటులో ఉంచి దరఖాస్తులను పూర్తి చేసేందుకు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ హెల్ప్‌డెస్కులకు స్పందన పెరగడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ కూడా పార్టీ కార్యాలయాలు, డివిజన్లలో సహాయక కేంద్రాలను ప్రారంభించాయి.
రెండు నిమిషాల్లో దరఖాస్తు..
దరఖాస్తు పూరించడం కష్టంగా భావించిన ఓటర్లు, హెల్ప్‌డెస్కుల వద్దకు వెళ్లగానే రెండు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతోంది. శిక్షణ పొందిన సిబ్బంది పాత ఓటరు జాబితా ఆధారంగా అవసరమైన వివరాలను గుర్తించి, ఫారంలో ఎక్కడ నమోదు చేయాలో వివరిస్తున్నారు. దీంతో ఓటర్లలో ఉన్న అయోమయం తొలగి, గత మూడు నాలుగు రోజులుగా ఓటరు గణన ప్రక్రియ వేగం అందుకుంది. జిల్లా అధికారులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తప్పు రాస్తే ఓటు పోతుందేమో!
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు గణన ఫారంలో పలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జనన సంవత్సరం ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండటంతో పాటు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, నియోజకవర్గం, భాగం సంఖ్య, ఓటరు క్రమ సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంది. వివాహానికి ముందు, తర్వాత రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఒకదాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంది. ఈ వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఓటు తొలగిపోతుందనే భయంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని చదువుకున్న ఓటర్లు కూడా దరఖాస్తులు నింపడంలో సందిగ్ధానికి గురవుతున్నారు.
